భగవంతునికి భక్తులకు అనుసంధానంగా ఉంటా : దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
– విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి
– పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ వచ్చిన కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. దేవాదాయ శాఖను విజయవంతంగా నిర్వహించేలా దీవించమంటూ స్వామీజీని కోరారు. భక్తులకు భగవంతునికి అనుసంధానంగా ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తానని హామీనిచ్చారు.
ఆలయాల్లో మెరుగైన సేవలు, దేవాదాయ శాఖ సమగ్ర నిర్వహణకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా మంత్రి కొట్టు సత్యనారాయణ స్వామీజీని కోరారు. అంతకుముందు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. మంత్రి వెంట దేవాదాయశాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ కూడా స్వామీజీని కలిసిన వారిలో ఉన్నారు.













