ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 55కి పైగా కీలక అజెండా అంశాలతో సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ప్రభుత్వం పలు చారిత్రాత్మక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర ఆర్థికసంఘం నిధులు రూ.16,500 కోట్లు మురిగిపోకుండా ఈ ఏడాది అక్టోబర్ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు.
అలాగే కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పాత పద్ధతిలోనే ఒకే డిప్యూటీ మేయర్ పదవికి పరిమితం కావాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ ఏకంగా 10,060 పోస్టులతో కూడిన కొత్త ‘జాబ్ క్యాలెండర్’ ప్రకటనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రత్యేకంగా జేఈఈ (JEE), నీట్ (NEET) కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు, ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణకు కొత్త కమిషన్ బిల్లు ప్రతిపాదనను ఓకే చేశారు. అంతేకాకుండా, ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన అవయవ మార్పిడికి సంబంధించిన ‘ట్రాన్స్ ప్లాంటేషన్ బిల్లు’కు, ఏపీఎస్బీసీఎల్ (APSBCL) సంస్థకు రూ.5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతుల కల్పన దిశగా కేబినెట్ భారీ నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, విశాఖపట్నంలో అక్షత్ గ్రీన్టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్ మరియు డేటా సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తూ తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అమరావతి రాజధాని పరిధిలో హ్యామ్ (HAM) మోడల్లో రూ.7,469.46 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధికి, అమరావతి రైల్వేలైన్ నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని నిర్ణయించడంతో పాటు రాయలసీమ ప్రాజెక్ట్ హెచ్ఎన్ఎస్ఎస్ (HNSS) ఫేజ్-2 నీటి పనులపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు.








