YSRCP: వైసీపీలో లిక్కర్ చెమటలు
ఏపీలో మద్యం కుంభకోణం కచ్చితంగా వైసీపీ(YSRCP)ని ఇబ్బంది పెట్టే సంకేతాలు కనపడుతున్నాయి. వైసీపీ కీలక నేతలు మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సొంత మద్యం బ్రాండ్లను వైసీపీ నాయకులు తయారు చేశారని.. ఆరోపణలు వినిపించేవి. ముఖ్యంగా అప్పట్లో మంత్రులు, కొంతమంది ఎంపీలు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో అప్పుడు కీలకంగా ఉన్నారు.
ఇక చిత్తూరు జిల్లా నుంచి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy), ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కొంతమంది రాయలసీమ నేతల పేర్లు కూడా అప్పట్లో ప్రముఖంగా వినిపించాయి. రాజకీయంగా ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు దీనిపై దర్యాప్తు సంస్థలు కూడా దూకుడు పెంచడంతో వైసిపి కీలక నేతలను అరెస్టు చేయవచ్చు అనే సంకేతాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎవరి పేరు బయట పెడతారు అనేదానిపైనే ఆసక్తి నెలకొంది.
ఆయన మద్యం కుంభకోణం లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును గతంలో ప్రస్తావించారు. ఇప్పుడు కూడా దర్యాప్తు అధికారుల ముందు ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి కొంతమంది పేర్లను కూడా విజయసాయిరెడ్డి బయట పెట్టే అవకాశాలు ఉండొచ్చు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇక తనను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పలుమార్లు ఆయన విచారణకు కూడా హాజరు కాకుండా తప్పించుకున్నారు.
మొత్తం నాలుగు సార్లు ఆయనకు నోటీసులు జారీ చేసింది దర్యాప్తు బృందం. త్వరలోనే మరి కొంతమంది కీలక నేతలకు కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దీనిపై ఫోకస్ పెట్టే సంకేతాలు సైతం కనపడుతున్నాయి. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యల తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనిపై దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.













