అమరావతిలో లయన్ సఫారీ
ప్రపంచంలో అత్యంత సుందరమైన రాజధాని నిర్మాణం జరగాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి లయన్ సఫారీ పార్క్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. అదే విధంగా రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున జూపార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని అతి పెద్ద జూపార్క్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు చెందడంతో నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా ప్రపంచ స్థాయిలో జూపార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలలో జూపార్క్‌లు ఉండగా వాటిలో సింహాల సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లయన్ సఫారీతో పాటు జూపార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూపార్క్ కోసం రెండు వందల ఎకరాలు భూమి కేటాయించాలని అటవీశాఖ ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది. అమరావతిలో ఏర్పాటు చేసే లయన్ సఫారీలో దేశంతోపాటు, ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన సింహలను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా రాజధానికి వచ్చే సందర్శకులను పెంచడంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అటవీశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.













