వచ్చే ఎన్నికల్లో ఇంటికే అంటూ.. బాలకృష్ణపై ధ్వజమెత్తిన కొడాలి నాని
టీడీపీ నేత, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణపై వైసీపీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని ఇటీవల బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నారని ప్రగల్భాలు పలుకుతున్న బాలయ్యకు ప్రజలు బుద్ధి చెప్తారని ధ్వజమెత్తారు. వైనాట్ పులివెందుల అంటున్న ఆయనకు వచ్చే ఎన్నికల్లో జగన్ అంటే ఏమిటో ప్రజలే ప్రత్యక్షంగా చూపిస్తారని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ భారీ మెజార్టీతో గెలిచి.. బాలకృష్ణ, చంద్రబాబులను ఇంటికి పంపడం ఖాయమని కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రజల్లో ఏమాత్రం నమ్మకం లేని నాయకులు, తమ నమ్మకాన్ని కోల్పోయిన వాళ్లు, పార్టీ కార్యకర్తల మద్దతు లేని వాళ్లు ఎవరైనా సరే వారికి జగన్ టికెట్లు ఇవ్వరని నాని తేల్చిచెప్పారు. అలాంటప్పుడు తమ పార్టీలో టికెట్లు దక్కని నేతలు.. చంద్రబాబుతో టచ్లో ఉంటే మాత్రం తమకు నష్టం ఏముంటుంది? అని కొడాలి నాని ధీమాగా ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవాలంటే మనతో ప్రజలు టచ్లో ఉండాలని, అంతేకానీ ప్రజాదరణ లేని ఎమ్మెల్యేలు కాదని బాలకృష్ణకు చురకలు వేశారు.













