ఇకనైనా జగన్ అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలి : మాధవీరెడ్డి
ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటని తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం హేయమైన చర్య అన్నారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ఆ హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక కుయుక్తులకు తెరలేపారని విమర్శించారు. స్పీకర్ ఎన్నిక రోజు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరూ అసెంబ్లీకి రాలేదన్నారు. ఆరుగురు శాసన సభ్యులను పీకేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని మీరన్న మాటలు మరిచిపోయారా జగన్? ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలోకి వస్తారా? ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు? మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు మీకు పట్టవా? ఇకనైనా జగన్ అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలి. ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి లేడు. ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ కొత్త నాటకాలకు తెరలేపారు అని మండిపడ్డారు.













