అంబటి రాంబాబు రాజీనామా చేయాలంటూ జనసేన ర్యాలీ
మంత్రి పదవికి అంబటి రాంబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సత్తెనపల్లిలో జనసేన భారీ ర్యాలీ చేపట్టింది. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు లంచం కోరిన అంశం ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాన్ని అట్టుడికిస్తోంది. ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియాలో వాటా అడగడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన జనసేన.. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని బాధితులకు హామీ ఇచ్చింది. అయితే ఇందులో తన తప్పేమీ లేదంటూ మంత్రి అంబటి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో మంగళవారం జనసేన భారీ ర్యాలీ నిర్వహించింది. సత్తెనపల్లిలోని జనసేన పార్టీ ఆఫీసు నుంచి రెవెన్యూ డివిజినల్ ఆఫీసు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అంబటి రాంబాబు లంచం తీసుకోవడంపై జనసేన అందోళన వ్యక్తం చేసింది. మృతుల పరిహారంలో వాటాలు అడిగే అంబటి రాంబాబుకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని జనసైనికులు అన్నారు. దీనిపై అధికారులు స్పందించి బాధితులకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షల చెక్కు అందించాలని కోరారు. జనసేనాని పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసే మంత్రి ఇప్పుడు పర్లయ్య దంపతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తన అవినీతిని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేసిన అంబటి ఇప్పుడేమయ్యారని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం ఆగదని నేతలు తెలిపారు.













