అమరావతి అద్భుతం : ఇజ్రాయెల్
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అవసరమైన వేలాది ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూసమీకరణకు ఇవ్వడం తమను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి బృందం పేర్కొంది. అమరావతి నిర్మాణ ప్రణాళికలు ఆద్భుతంగా ఉన్నాయని, నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు రూపొందిస్తున్న ప్రణాళికలు బేషుగ్గా ఉన్నాయని ఆ బృందం ప్రశంసించింది. ఇజ్రాయెల్ రాజకీయ వ్యవహారాల సలహాదారు, ఫస్ట్ సెక్రటరీ ఆద్వా విల్చిన్స్కీ నేతృత్వంలోని ఈ బృందం సభ్యులు విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అమరావతి నిర్మాణ విశేషాలను సీఆర్డీయే అధికారులు వారికి వివరించారు. అన్ని అంశాల్లో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ ఉన్నత విద్య, నూతన ఆవిష్కరణల విభాగం మంత్రి డిట్టా ఫ్రోయిం అమరావతిలోని వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి అసెంబ్లీ ఆకృతి తమ దేశ పార్లమెంట్ భవనం తరహాలో ఉందని బృందం నాయకుడు అద్వావిల్ అన్నారు.













