Chandrababu Naidu: పెట్టుబడులు–పాలన–ఇమేజ్ 2025 లో సంవత్సరంలో చంద్రబాబు గ్రాఫ్ ఇదే..
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కు 2025 సంవత్సరం రాజకీయంగా, పరిపాలన పరంగా అత్యంత కీలకంగా మారిందని చెప్పాలి. గత ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చినప్పటికీ, అప్పటికే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పరిపాలనా అవ్యవస్థ, అధికారుల బదిలీలు వంటి అంశాలు ఆయన ముందు పెద్ద సవాళ్లుగా నిలిచాయి. ఆ దశలో ప్రభుత్వం పూర్తిగా గాడిలో పడేందుకు కొంత సమయం పట్టినప్పటికీ, ఈ ఏడాది మాత్రం చంద్రబాబు పూర్తిగా పరిస్థితిని తన నియంత్రణలోకి తీసుకున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థపై పూర్తి అవగాహన పెంచుకున్న చంద్రబాబు, గత వైసీపీ పాలనలో జరిగిన విధానపరమైన నిర్ణయాలు, అప్పులు, ఆర్థిక భారం వంటి అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ముఖ్యంగా అమరావతి (Amaravati) రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయడం ఆయన పరిపాలనా స్పష్టతకు నిదర్శనంగా భావిస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణంపై స్పష్టమైన దిశను ఇవ్వాలన్న ప్రయత్నం ఆయన నుంచి కనిపించిందన్న అభిప్రాయం ఉంది.
ఈ ఏడాది పెట్టుబడుల ఆకర్షణకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. జనవరి నుంచి గత నెల వరకు స్విట్జర్లాండ్ (Switzerland), సింగపూర్ (Singapore), బ్రిటన్ (Britain), దుబాయ్ (Dubai) వంటి దేశాల్లో పర్యటిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని వివరించడంతో పాటు, ప్రభుత్వ విధానాలను వివరించారు. ఈ ప్రయత్నాలకు విశాఖపట్నంలో (Visakhapatnam) నిర్వహించిన సీఐఐ సదస్సు మరింత బలం చేకూర్చింది. ఆ సదస్సు తర్వాత పెట్టుబడులపై సానుకూల స్పందన రావడం గమనార్హం.
ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) ఏర్పాటుకు మార్గం సుగమం కావడం ఆయన రాజకీయ చాతుర్యానికి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. దీని ద్వారా రాష్ట్రానికి ఐటీ రంగంలో కొత్త గుర్తింపు లభిస్తుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధి, ఉద్యోగాల కల్పన అంశంలో కూడా చంద్రబాబు తన ఇమేజ్ను బలోపేతం చేసుకున్నారని అంటున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉందన్న అభిప్రాయం ఉంది. ఒకప్పుడు పార్టీ అంతర్గత విభేదాలు తలెత్తితే వెంటనే కఠిన చర్యలు తీసుకునే ధోరణి ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆచితూచి, సమతుల్యంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో వివాదాలకు కారణమైన నేతలు తమంతట తామే సర్దుకునే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వాటి అమలుపై స్పష్టత ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై పాజిటివ్ భావన పెంచే ప్రయత్నం కూడా చంద్రబాబు చేశారు. అంతర్జాతీయంగా కూడా ఆయనకు గుర్తింపు లభించడం గమనార్హం. అనేక సంస్థలు ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ పెట్టుబడులకు ముందుకు వస్తున్నామని ప్రకటించాయి. ఇటీవల ఎకనామిక్ టైమ్స్ (Economic Times) ఆయనకు “బిజినెస్ రిఫార్మర్ – 2025” అవార్డును ప్రకటించడం ఈ గుర్తింపుకు మరో ఉదాహరణగా నిలిచింది. మొత్తం మీద 2025లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన రాజకీయ గ్రాఫ్‌ను స్పష్టంగా పెంచుకున్నారని చెప్పొచ్చు.






