జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు… సన్నద్ధమవుతున్న ఏపీ సర్కార్

ఏపీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జగన్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు సర్కార్ సన్నద్ధమవుతోంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్న హామీకి జగన్ ప్రభుత్వం కట్టుబడింది. జూలై మాసంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 10 వ తరగతి పరీక్షలు మాత్రం జూలై చివరి మాసంలో నిర్వహించే సన్నాహకాల్లో ఉన్నామని ఆయన వెల్లడించారు. అయితే సీఎం జగన్‌తో ఇంకా చర్చించలేదని, చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. పరీక్షలను నిర్వహించే సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండానే చూసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.