కేఎల్ వర్సిటీని సందర్శించిన అమెరికన్ కాన్సులేట్ బృందం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ బృందం సందర్శించింది. కాన్సులేట్ వైస్ కౌన్సిల్ చార్లిస్ స్పెక్ట్, సాంస్కృతిక వ్యవహారాల సహాయకులు సింథిల్, యూఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రాంతీయ అధికారి మెకానికా సేటియాతో కూడిన బృందం సభ్యులు కేఎల్ఈఎఫ్ అధ్యక్షుడు కోనేరు సత్య నారాయణ, ఉపకులపతి డాక్టర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి, అంతర్జాతీయ సంబంధాల సంచాలకులు డాక్టర్ కిషోర్ బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో తరగతి గదులతో పాటు పరిశోధన కేంద్రాలను పరిశీలించారు. పరిశోధనల వివరాలను తెలుసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.
అనంతరం అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో సంయుక్తంగా విద్యావిధానాన్ని నిర్వహించే పలు కీలక అంశాలపై, అవగాహనపై ఒప్పందాలపై, అంతర్జాతీయ బదిలీ కార్యక్రమాలపై చర్చించారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసంపై చర్చించినట్లు కేఎల్యూ ఉపకులపతి డాక్టర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఆఫ్రికా, యూరప్, అరబ్ దేశాల విద్యార్థులు తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేశారని తెలిపారు.













