ఆ యాప్‌తో జాగ్రత్తగా ఉండాలి : హోంమంత్రి
సాంకేతిక పరిజ్ఞానం నేరాల పెరుగుదలకు ఒక కారణమైందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ అంశంపై సచివాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కేవలం మహిళలు, పిల్లల్నే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. శత్రువులు ఎక్కడో లేరని, మన చేతుల్లోని ఫోన్ల రూపంలోనే ఉన్నారని అన్నారు. ఫోన్ బాగుచేయించడానికి ఇస్తే అందులో స్పై యాప్‌లు వేసి ఇస్తున్నారని, స్పై యాప్స్‌తో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాంకేతికతతో ప్రయోజనాలున్నప్పటికీ అనర్థాలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బాధితులకు సత్వర న్యాయం కోసం అందరి సహకారం కావాలని ఆమె కోరారు.













