High Court: శారదా పీఠానికి హైకోర్ట్ షాక్
ఆంధ్రప్రదేశ్ లో శారదా పీఠం (Sharadha peetham) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. శారదా పీఠం విషయంలో గత ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. పెద్ద ఎత్తున భూములు కేటాయించడం.. అలాగే తిరుమలలో భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదం అయింది. ఇక తాజాగా ఏపీ హైకోర్ట్ (High Court) శారదా పీఠంకు ఊహించని షాక్ ఇచ్చింది. తిరుమల శారద పీఠం భవనం విషయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది విచారణ సందర్భంగా. అనుమతులు లేకుండా జరిపిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలులేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆ భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్లాన్ కు విరుద్దంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠానికి ఆదేశాలు ఇచ్చింది. శారదా పీఠం తిరుమలలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికి టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు, న్యాయవాది తుమ్మా ఓంకార్ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు.
గతంలో ఈ పిల్ పై విచారణ జరిపి భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఈ రోజు ఈ పిల్ పై మళ్లీ విచారణ జరిగింది. శారదాపీఠం భవనాన్ని సీజ్ చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. బిల్డింగ్ ప్లాన్ అనుమతులకు విరుద్దంగా నిర్మాణాలు ఎలా చేస్తారని హైకోర్ట్ ప్రశ్నల వర్షం కురిపించింది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేతకు ఆదేశాలిస్తామని హైకోర్ట్ స్పష్టం చేసింది. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని శారదాపీఠం తరుపు న్యాయవాది కోరారు. దీనితో హైకోర్ట్ విచారణ వాయిదా వేసింది.













