వంశీకి లైన్ క్లియర్…
గన్నవరం నియోజకవర్గ వైసీపీలో తనకు ఎదురులేదని వంశీ నిరూపించుకున్నారా? ఉండే ఉండండి.. పోతే పొండి అన్నట్లుగా యార్లగడ్డ వెంకట్రావును.. పార్టీ అగ్రనేతలు అత్యంత అవమానకర రీతిలో బయటకు పంపారా? పార్టీకి ఎంతో సేవ చేసిన తనను.. పొమ్మనకుండా పొగపెట్టారని యార్లగడ్డ అంత ఆవేదన ఎందుకు చెందారు.. ? జగన్ తన రాజకీయ భవిష్యత్తును సెట్ చేస్తారని భావించినా.. నిరాశే ఎదురుకావడంతో యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పారు.
“రాజకీయాల్లో అవమానాలకు కూడా కొంత హద్దు ఉంటుంది. ఏ పార్టీలో పనిచేసినా తమకు జరిగిన అవమానాలు బయటకు చెప్పుకోరు. ప్రాంతీయ పార్టీలో పనిచేసేటప్పుడు 40 నుంచి 50 శాతం అవమానాలు వస్తే ఎదుర్కోవచ్చు. కానీ 90 శాతంపైగా అవమానాలు వచ్చాయి కాబట్టే ఉండలేక రాజీనామా నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. వంశీతో కలిసి పనిచేస్తే ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ చెప్పారని.. అయితే తాను అలాంటి రాజకీయాలు చేయలేనని చెప్పేశానన్నారు యార్లగడ్డ. అమెరికాలో ఉండే తనను రాజకీయాల్లోకి పిలిచి, నడిరోడ్డుపై వదిలేశారని సీఎం జగన్ తీరును ఆక్షేపించారు. తాను గన్నవరాన్ని వదిలేది లేదని తెగేసి చెప్పారు.
గన్నవరం నియోజకవర్గంలో ఓడిపోయినా నేను ఎప్పుడూ నా కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్నాను. వైసీపీ పార్టీ గన్నవరంలో నా అవసరం లేదనుకున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు నేను అమెరికా వెళ్లిపోతానని, టీడీపీ నేతలతో టచ్లో ఉన్నానని అల్లరి చేశారు. మీడియా వేదికగా చంద్రబాబును అపాయింట్మెంట్ అడిగాను. ఏదో ఒక రాజకీయ పార్టీ అండ కావాలి. కార్యకర్తలు అందరూ కూడా టీడీపీ వైపే మొగ్గుచూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటా.” ఆయన స్పష్టం చేశారు.
మరి మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు పరిస్థితి ఏంటి? వంశీకి టికెట్ ఇస్తే దుట్టా ఏం చేయనున్నారు. ఇప్పటికే యార్లగడ్డ పార్టీ నుంచి ఔట్ అయ్యారు. ఇక దుట్టా పరిస్థితి రాజకీయంగా ఎలా ఉండనుంది. ఇప్పుడిదే అంశం అటు దుట్టా వర్గీయుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి వచ్చిన వంశీ కోసం.. పార్టీకోసం కష్టపడిన నేతలకు అన్యాయం చేస్తున్నారన్న ఆక్రోశం దుట్టా వర్గీయుల్లో ఉంది. అయితే సమయం వచ్చినప్పుడు .. అది బయటపడుతుందని చెబుతున్నారు.













