Y.S. Sharmila: పోలవరం కంటే బనకచర్ల కు ప్రాధాన్యత అవసరమా ? సీఎం ప్లాన్లపై షర్మిల ఘాటు ప్రశ్నలు..

ప్రజల కోసం తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురి అవుతాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన బనకచర్ల ప్రాజెక్టు (Bhanakacherla project) పరిస్థితి కూడా అంతే. ఈ అంశం పై టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YSRCP) ను.మించి షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తదిశగా చర్చను మళ్లించాయి.
రాష్ట్రానికి ప్రయోజనం లేదని మేధావులంతా చెబుతున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా ఎందుకు తీసుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు. ఇంజినీర్లు కూడా ఈ ప్రాజెక్టు అవసరం లేదని చెప్పినప్పుడు, ఇంకా దీనిని కొనసాగించడంలో ఏ ఉద్దేశముందని ఆమె నిలదీశారు. దీని వెనక చంద్రబాబు స్వలాభం మాత్రమే ఉందని ఆమె ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో, అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి రాష్ట్రానికి లాభం లేనిది ఎందుకు చేపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
ఒకే ఒక్క కాంట్రాక్టర్‌కు ఉపయోగపడే ప్రాజెక్టు కోసం పాలనను వదిలిపెట్టి ఢిల్లీ (Delhi) చుట్టూ తిరుగుతారా? అని ఆమె మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు (Polavaram) ఇది ఇబ్బంది కలిగించేలా ఉందని అధికార సంస్థలు చెబుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నలు జారిపోకుండా వేశారు.
గోదావరి (Godavari) నదిలో నుంచి నీరు తీసుకురావడం కంటే, రాయలసీమకు హక్కుగా ఉన్న కృష్ణా (Krishna) మరియు తుంగభద్ర (Tungabhadra) నదుల మీదే దృష్టిపెట్టాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై రూ.40 వేల కోట్లు వెచ్చిస్తే 50 లక్షల ఎకరాలకు సాగునీరు, కోటి మందికి తాగునీరు అందిస్తారని ఆమె వివరించారు.
జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తే బనకచర్ల అవసరమే లేదని, కానీ ఇతర లాభాల కోసం ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారన్నదానిపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై కూడా షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్ టైంలో పోలవరం విషయంలో ఏ అభివృద్ధి జరగలేదని, 5 ఏళ్ల పాలనలో గుట్టెడు మట్టికూడా తీయలేదని ఎద్దేవా చేశారు. మొత్తంగా బనకచర్ల అంశం రాష్ట్రంలో రాజకీయం వేడెక్కేలా చేసింది.