TTD Ghee: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం… రంగంలోకి దినేష్ కుమార్ కమిషన్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ కోసం, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటం కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పుడు తన విచారణను వేగవంతం చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న నివేదిక బయటకు రావడంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సిట్, సిబిఐ విచారణలు చేశాయి. వాటిని ఆధారంగా చేసుకుని గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సేకరణ విధానాలు, టెండర్ల ప్రక్రియ, నాణ్యత పరీక్షల్లో జరిగిన లోపాలను వెలికితీయడానికి ప్రభుత్వం దినేష్ కుమార్ కమిషన్‌ను నియమించింది.
దినేష్ కుమార్ కమిషన్ కేవలం కల్తీ జరిగిందా లేదా అని తేల్చడానికే పరిమితం కాకుండా, వ్యవస్థాగత మార్పులపై దృష్టి సారించనుంది. తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసేందుకు కంపెనీలు ఎలా ముందుకు వచ్చాయి? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అన్నది పరిశీలిస్తుంది.
ఇవి కూడా చదవండి
టీటీడీ ల్యాబ్‌లలో పరీక్షలు ఎందుకు విఫలమయ్యాయి? సరఫరాదారులు పంపిన నమూనాలను నిశితంగా ఎందుకు పరిశీలించలేదు? లాంటి అనేక అంశాలను సమీక్షిస్తుంది. గత బోర్డు నిర్ణయాల్లో రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అన్న కోణంతో పాటు భవిష్యత్తులో నెయ్యి సేకరణ ఎలా ఉండాలి? స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సేకరించేందుకు అత్యుత్తమ మార్గాలేవి? అనే అంశాలపై నివేదిక ఇవ్వనుంది.
కమిషన్ ఇప్పటికే తన కార్యకలాపాలను ప్రారంభించింది. తిరుమల చేరుకున్న దినేష్ కుమార్, నెయ్యి ట్యాంకర్ల రికార్డులు, మార్కెటింగ్ విభాగం ఫైళ్లను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లలో నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్ల వివరాలు, వారి అర్హతలు, అప్పట్లో టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా, రివర్స్ టెండరింగ్ పేరుతో నాణ్యతను పక్కన పెట్టి ధరకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఈ సమస్య తలెత్తిందా అన్నది కమిషన్ ప్రధానంగా విశ్లేషిస్తోంది.
ఈ కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాల నుండి కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే సిట్ విచారణ జరుగుతుండగా, మళ్లీ ఐఏఎస్ కమిషన్ అవసరమా అన్నది వారి ప్రశ్న. అయితే, సిట్ అనేది క్రిమినల్ కోణంలో ఎవరు నేరం చేశారనేది విచారిస్తుంది, కానీ దినేష్ కుమార్ కమిషన్ పరిపాలనాపరమైన లోపాలను సరిదిద్దడానికి ఉద్దేశించినదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
దినేష్ కుమార్ కమిషన్ ఇచ్చే నివేదిక టీటీడీ చరిత్రలో అత్యంత కీలకం కానుంది. కేవలం నిందితులను శిక్షించడమే కాకుండా, రాబోయే రోజుల్లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు కఠినమైన నిబంధనలు, అత్యాధునిక ల్యాబ్ పరీక్షలు, పారదర్శకమైన సేకరణ విధానాలను ఈ కమిషన్ సూచించనుంది. ఈ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు వచ్చి, శ్రీవారి ప్రసాదానికి మళ్లీ పూర్వ వైభవం లభిస్తుందని భక్తులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి

















