Tirumala: డ్రోన్ విజిలెన్స్ వల్ల శ్రీవారి మెట్టు వద్ద తప్పిన పెను ప్రమాదం..
అటవీ శాఖ (Forest Department), టిటిడీ విజిలెన్స్ టీమ్, పోలీసుల క్విక్ యాక్షన్ వల్ల తిరుపతి (Tirupati) సమీపంలో శ్రీవారి భక్తులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శేషాచలం (Seshachalam) అడవుల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు తిరుపతి వైపు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అపాయం తప్పించారు. సోమవారం రాత్రి శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 ఏనుగులు సంచరిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. టిటిడీ విజిలెన్స్ (TTD Vigilance) సిబ్బంది, పోలీసులతో కలిసి డ్రోన్ కెమెరా సహాయంతో అడవుల్లో నిఘా వేస్తుండగా ఈ గుంపు కనిపించింది.
శ్రీవారి మెట్టు మార్గం (Srivari Mettu Route) శ్రీనివాస మంగాపురం దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఈ దారిలోనే త్వరగా కొండ ఎక్కాలి అని పాదయాత్రగా తిరుమలకు (Tirumala) వెళ్ళే భక్తులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అయితే అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండటం, ఎర్రచందనం అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఆధారంగా పర్యవేక్షణ పెంచారు. డ్రోన్ సహాయంతో అడవిలో ఏనుగుల గుంపు ఉన్నట్లు గుర్తించిన వెంటనే పోలీసు అధికారులు హైఅలర్ట్ ప్రకటించి, భక్తులను ముందుకి వెళ్లకుండా ఆపారు.
ఈ సమయంలో ఆల్రెడీ టోకెన్లు తీసుకుని పాదయాత్ర ప్రారంభించిన యాత్రికులు శ్రీవారి మెట్టు దాటి కొంత దూరం వెళ్ళినట్లు సమాచారం. అయితే శ్రీనివాస మంగాపురం దాటిన వెంటనే అడవులు ప్రారంభమవుతాయి. అక్కడ జనసంచారం తక్కువగా ఉండటం వల్ల ఏనుగుల తాకిడి ఉంటే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా అధికారులు భక్తులను వినాయకస్వామి చెక్‌పోస్టు వద్దే నిలిపివేశారు. దాదాపు ఒక గంట పాటు భక్తులు అక్కడే ఉండాల్సి వచ్చింది.
అటవీ శాఖ (Forest Department), టిటిడీ విజిలెన్స్ టీమ్, పోలీసులు కలిసి రంగంలోకి దిగారు. ఏనుగులను తిరిగి అడవిలోకి తరలించేందుకు వారు అనేక ప్రయత్నాలు చేశారు. అటవీ ప్రాంతానికి వెళ్లే దారులను ఓవరాల్‌గా నిర్ధారించి, గజరాజులు మళ్లీ అడవి వైపు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి సుమారు నాలుగు గంటలు పట్టింది. చివరికి ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల చొరవతో ఓ పెద్ద ప్రమాదం తప్పిపోయింది. టెక్నాలజీ సాయంతో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేకుండా భక్తులను రక్షించగలగడం చాలా ప్రశంసనీయం. ప్రజల భద్రత కోసం వ్యవస్థలు ఎంత మంచి చర్యలు తీసుకుంటున్నాయో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది.







