నారాయణ.. నారాయణ..! స్వామీజీనే ఓటు అడిగితివా..?
నారాయణ.. పేరు చాలా మందికే ఉంటుంది. కానీ సీపీఐ నారాయణ మాత్రం ఒక్కరే ఉంటారు. రాజకీయాల్లో తనదైన శైలితో ప్రజల్లో ముద్ర వేసుకున్నారాయన. గతంలో ఓసారి చికెన్ తో పాపులర్ అయిన నారాయణ.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆయన ఏకంగా స్వామీజీనే ఓటడిగారు. దీంతో ఆయన పేరు మార్మోగిపోతోంది.
ఏపీలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతన్నాయి. ఇందుకోసం పార్టీలన్నీ ప్రచారాల్లో మునిగిపోయాయి. అందులో భాగంగానే సీపీఐ నారాయణ కూడా విశాఖ వెళ్లారు. తమ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల కోసం ఆయన కూడా ప్రచారంలోకి దిగారు. 97వ వార్డులో సీపీఐ తరపున యశోద అనే ఆవిడ పోటీ చేస్తున్నారు. నిన్న 97వ వార్డులో పర్యటించిన నారాయణ.. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
ఆ క్రమంలో శారదాపీఠం కూడా కనిపించింది. అక్కడే ఉన్న కార్యకర్తలు ఈ పీఠానికి సీఎం జగన్ తరచుకూ వస్తుంటారని నారాయణకు చెప్పారు. అవునవును.. నేను కూడా చాలాసార్లు చూశానంటూ.. మనం కూడా వెళ్దాం పదండి.. అక్కడ ఏం జరుగుతోందో… అని లోపలికి వెళ్లారు. అనుకోని అతిథి వచ్చేసరికి శారదాపీఠం సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. విషయాన్ని వెంటనే పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి చెప్పారు. ఆయన కూడా నారాయణను స్వాగతించారు.
స్వామీజీతో సుమారు 15 నిమిషాల సేపు ముచ్చటించారు. మా మాటలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి కదా అని నారాయణ స్వామీజీని అడిగారు. అయితే సమస్యలపై మీ మాటలు సూటిగా ఉంటాయన్నారు స్వామీజీ. మతాలు, విశ్వాసాలు, కులాలు, వేదాలు.. లాంటి అనేక అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఇక వెళ్తున్న సమయంలో స్వామీజీ నారాయణకు శాలువా కప్పి ప్రసాదం అందించారు.
ఈ క్రమంలోనే తమ వార్డు అభ్యర్థి యశోదను స్వామీజికి పరిచయం చేశారు నారాయణ. తమ అభ్యర్థి గెలిచేలా ఆశీర్వదించారని కోరారు. మిగిలినవాళ్లనే కాదు.. తమను కూడా గెలిచేలా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్వామీజీ నవ్వుతూ తలూపారు. పీఠంలోని సిబ్బందిని కూడా తమ అభ్యర్థికి ఓటేయాలంటూ నారాయణ విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం కామన్. అయితే ఏకంగా పీఠంలోకి వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడంతో అందరి చూపులూ నారాయణవైపు పడ్డాయి. మరి నారాయణ ప్రచారం కలిసొస్తాయో.. స్వామీజీ దీవెనలు ఫలిస్తాయో.. లేదో చూద్దాం..













