భాజాపాలో చేరితే ప్రబుద్ధులు పరిశుద్దులౌతారా? భాజాపాకి సిపిఐ సూటి ప్రశ్న
ఒక్క పసుపురంగునే కాదు. అన్ని రంగులను కాషాయీకరణ చేయగల బలం బిజెపికి ఉందని బిజెపి ఎపి ఇన్ చార్జి సునీల్ దియోధర్ వ్యాఖ్యానించడాన్ని ఆంధ్రప్రదేశ్ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా ఉన్న బిజెపి ఎపి ఇన్ చార్జి సునీల్ దియోధర్ వ్యాఖ్యలు గర్హనీయని, ప్రబుద్ధులంతా బిజెపిలో చేరగానే శుద్ధులవుతారా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇతర పార్టీల వారిని ఫిరాయింపులకు ప్రోత్సహించి బిజెపిలో చేర్చుకుని దాన్ని బలంగా చెప్పుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. రాజకీయాల్లో నైతిక విలువల గురించి పదే పదే వల్లెవేసే భాజాపా నేతలు అన్ని పార్టీల్లో ఉండేవాళ్లని బిజెపిలో చేర్చుకుంటామనడవమే నైతికతా అని నిలదీశారు.
నిజంగా బిజెపికి బలమున్నప్పుడు ఇతర పార్టీల వారిని బిజెపిలో పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరమేముందన్నారు. లేక అదే బిజెపి బలమా? అని ఎద్దేవా చేశారు. దానిని బలమంటారా లేక వాపంటారా? అంటూ ప్రశ్నించారు. గతంలో సుజనాచౌదరి, సిఎం రమేష్ లను మోసగాళ్లని, బ్యాంకులను కొల్లగొట్టారని బిజెపి నేత జివిఎల్ నరసింహారావు తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు విమర్శలు చేశారని గుర్తు చేస్తూ ఇప్పుడు బిజెపిలో చేరగానే ఆ ప్రబుద్ధులంతా పరి శుద్ధులుగా మారిపోయారా అంటూ దుయ్యబట్టారు.
లేక బిజెపిలో చేరగానే దుర్మార్గులకు, మోసగాళ్లకు మంచివాళ్లనే కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. అన్ని పార్టీలను కాషాయమయం చేస్తామనడం ఏ రకంగా రాజనీతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితి చూస్తంటే భారత ప్రజాస్వామిక వ్యవస్థకు బిజెపి అత్యంత ప్రమాదకరంగా తయారైందన్నది అర్ధమవుతోందన్నారు.













