జెసి ప్రభాకర్‌రెడ్డికి మళ్లీ బెయిల్…
ఆయనను దాదాపు రెణ్నెళ్ల క్రితం ఆరెస్ట్ చేశారు. కొన్ని రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్ ఇచ్చారు. కేవలం 24 గంటల్లోనే మళ్లీ అరెస్ట్ చేశారు. వారం రోజుల వ్యవధిలో బెయిల్ ఇచ్చారు. ఆయనెవరో కాదు మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి. ఆర్టిఐ కేసులో అరెస్టై జైలు పాలైన జెసి ప్రభాకర్‌రెడ్డి బెయిల్‌పై విడుదల అవడం, ఆ ఉత్సాహంలో జైలు బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళుతూ అనుచరులతో హంగామా చేసి, పోలీసులపై దురుసుగా ప్రవర్తించి మళ్లీ అరెస్టవడం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పరీక్షలు జరపగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కడప జైలులో ఉంటున్న ఖైదీలలో 700 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 317 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. అందులో జెసీ ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తనకు కరోనా సోకిందని, అంతే కాకుండా తాను గుండెకు సంబంధించిన సమస్యతో కూడా బాధపడుతున్నానని జెసీ మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో కోర్టు ఆయనకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.













