ఈసారి జ’గన్’ పేలుతుందా..?
సంక్రాంతి తర్వాత ఏపీలో పోల్ రాజకీయం మరింత పీక్స్‌కు చేరనుంది.ముఖ్యంగా వైసీపీ అధినేత , సీఎం జగన్.. పార్టీ గేర్ మార్చనున్నారు. నియోజకవర్గాల తుది జాబితా విడుదల చేసి 25 నుంచి జనంలోకి వెళ్ళనున్నారు సీఎం జగన్.గెలుపు గుర్రాల ఎంపికలో ప్రత్యర్ధి పక్షాల కంటే ఒక అడుగు ముందే ఉన్న వైఎస్ జగన్ …సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇప్పటి వరకు మూడు జాబితాల్లో 59 నియోజకవర్గాల్లో ఇంఛార్జులను మార్పు చేశారు. వీటిలో 50 అసెంబ్లీ, 9 లోక్ సభ సెగ్మెంట్లు ఉన్నాయి. మరో 30 వరకు సెగ్మెంట్లలో మార్పులు చేసే అవకాశం ఉంది.దీనికి సంబంధించిన కసరత్తు పార్టీ హైకమాండ్ చేస్తోంది. సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గాలు, స్థానికంగా గ్రూపులు ఉన్న చోట్ల నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. సంక్రాంతి పండుగ కావటంతో కసరత్తుకు కొంత బ్రేక్ ఇచ్చారు. పండుగ అయిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఈ కసరత్తు అంతా పూర్తి చేసి …చివరి జాబితా విడుదల చేయనున్నారు.
ఈనెల 25వ తేదీ నుంచి క్యాడర్ సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్ చేపట్టనున్నారు వైసీపీ అధినేత. వైసీపీ ఏర్పాటు చేసుకున్న ఐదు రీజియన్స్ లో ఐదు క్యాడర్ మీటింగ్స్ ను ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్నారు. 4 నుంచి 6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి సమావేశం 25వ తేదీన విశాఖపట్నం లేదా భీమిలీలో జరుగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన రీజియన్స్ లో ప్లేస్, తేదీల పై ఇంకా కసరత్తు జరుగుతోంది. నేతల మధ్య ఉండే గ్రూపు తగాదాలు, విబేధాలను పక్కన పెట్టి పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసి కట్టుగా పని చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు.
క్యాడర్ మీటింగ్ లతో పాటు సీఎమ్ జగన్ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లోనూ సీఎమ్ పర్యటన ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మధ్యలో ఐదు ఆరు రోజుల పాటు సీఎమ్ షెడ్యూల్ కు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే పూర్తి స్థాయిలో జగన్ జనంలోనే ఉంటారని పార్టీ వర్గాల సమాచారం.













