ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 30 శాతం ఇన్సెంటివ్ లు : సీఎం జగన్

కరోనా కబలిస్తున్న వేళ ఏపీ సర్కార్ కీలక చర్యలు చేపడుతోంది. ఆక్సిజన్ ప్లాంట్లను ప్రోత్సహించడానికి నూతన పద్ధతిని అవలంబిస్తోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా బెడ్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే ఆస్పత్రులకు 30 శాతం ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇలా ఇస్తే ప్లాంట్లను స్థాపించడానికి మరింత ఉత్సాహవంతంగా ముందుకు వస్తారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం నాలుగు నెలల వ్యవధిలో అన్ని ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటయ్యేలా వ్యవస్థీకృతం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం 100 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను పెడితే 20 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని పేర్కొన్నారు. అలాగే 300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి పైనా దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్కులు ఇవన్నీ కూడా ప్రమాణాలున్న వాటినే ఉపయోగించాలని సూచించారు. అలాగే ఆక్సిజన్ తీసుకునేటప్పుడు వినియోగించే నీటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కోరారు.
గవర్నమెంట్ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్స కోసం ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే రోగులకు మంచి ఆహారం, పారిశుద్ధ్యత బాగుండాలని, వీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సూచించారు. ఐఎస్‌ఓ ట్యాంకర్లను వినియోగించుకొని సమర్థవంతంగా ఆక్సిజన్ సేకరిస్తున్నామని అధికారులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగంపై ఆడిట్ కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరా, పంపిణీ, వినియోగం, వీటన్నింటినీ పూర్తిగా కంప్యూటరైజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై, రెమిడేసివిర్ అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై కూడా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.