కర్నూలు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్నూలు జిల్లా చరిత్రలో ఇది సుదినం అన్నారు. ఈ నెల 28 నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. న్యాయ రాజధానిని మిగతా రాష్ట్రాలతో ఓర్వకల్లు కలుపుతుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పి హర్దీప్సింగ్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌతంరెడ్డి, పలువురు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రారంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా, బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్ జనవరి 27న ముంజురైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.













