ఆ నలుగురిపై…
వెంకటగిరి సభలో నేరుగా విపక్షనేతలపై సీఎం జగన్ ఫైరయ్యారు. ఇప్పటివరకూ రాజకీయ విధానాలపైనే విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడు నేరుగా వారి వ్యక్తిగత జీవితాలపైనా కామెంట్స్ చేశారు. అమ్మాయిలు, మహిళలపై విపక్షనేతలకు గౌరవం లేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం జగన్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సభలో విపక్షనేతల వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేయడంపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదేపదే వాలంటీర్ల వ్యవస్థపై పవన్ రాజకీయ దాడి చేయడం..దానికి చంద్రబాబు సపోర్టుగా మాట్లాడడంతోనే .. సీఎం జగన్ తీవ్రమైన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారని అందుకే ఈతరహా కామెంట్స్ చేశారని విపక్షనేతలు ఆరోపిస్తున్నారు.
రోజురోజుకూ వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ మాటల దాడి ముమ్మరం చేస్తూ వస్తున్నారు. సమాధానం చెప్పు జగన్ అంటూ ఏకవచనంతో సంభోదిస్తూ ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థ తీరుపై చర్చను తెస్తున్నారు. వాలంటీర్లు అడిగితే డేటా ఇవ్వొద్దని నేరుగా పిలుపుఇస్తున్నారు. అంతే కాదు.. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్దత లేదని, డేటా సంఘవిద్రోహశక్తుల చేతుల్లోకి వెళ్తోందని హెచ్చరికలు చేస్తున్నారు. వీటికి మంత్రులు కౌంటరిస్తున్నా, అవి సరిగ్గా జనంలోకి వెళ్లినట్లు కనిపించడం లేదు. అందుకే నేరుగా జగన్ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. వాలంటీర్ వ్యవస్థను గట్టిగా సమర్థిస్తూ.. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం జగన్. వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మరోసారి పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఫైరయ్యారు సీఎం జగన్.అమ్మాయిల్ని లోబర్చుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్ కల్యాణ్ క్యారెక్టర్ అని ఘాటుగా బదులిచ్చారు. అసలు వలంటీర్లను తప్పుబట్టింది.. పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం జగన్.అలాంటి వ్యక్తి.. వాలంటీర్ వ్యవస్థ చేస్తున్న సేవల ను తప్పుపట్టడమేంటన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థపై చర్చ జరగడం, మీడియాలోని పతాకశీర్షికల్లో వాలంటీర్ల అంశం ఉండడంతో.. విపక్షనేతలపై విమర్శలతో కొత్త అంశాన్ని జగన్ తెరపైక తెచ్చినట్లైందని నిపుణులు చెబుతున్నారు. అయితే పవన్ అడిగిన ప్రశ్నలకు నేరుగా జవాబివ్వకుండా.. ఇలా పర్సనల్ లైఫ్ పై దాడి చేయడమేంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల పవన్ విమర్శలు మరింత బలంగా .. ప్రజల్లోకి వెళ్లేప్రమాదముందని వైసీపీ నేతలు సైతం మదనపడుతున్నట్లు సమాచారం.













