జగన్ ధైర్యం…ఎన్నికల్లో సంస్కరణలు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలు ఆయనకు పార్టీకి ప్రజల్లో మంచి ఇమేజ్ను తీసుకువచ్చాయి. దానికితోడు పాలనలో అవినీతి లేకుండా చేయడం వంటివి సామాన్యజనాన్ని ఎక్కువ ఆకర్షించింది. ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో సంస్కరణలు తెస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన చట్టం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదుల్ని ఆకర్షిస్తోంది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఇంతవరకు ఎన్నికల కమిషన్ పలు నిబంధనలు విధించింది. వాటిని అతిక్రమిస్తే నేరుగా కమిషనే చర్యలు తీసుకునేది. అతిక్రమణదార్లపై పోలీసులు చిన్నాచితక కేసులెట్టేవారు. ఇవి ఏళ్ళ తరబడి సాగేవి. చివరకు తగిన ఆధారాల్లేక.. ఉన్నా చిన్న చిన్న అపరాద రుసుంల విధింపుతో కేసులు ముగిసేవి. కానీ ఇంతవరకు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేసే వెసులుబాటు కలగలేదు. తొలిసారిగా ఈ అవకాశాన్ని జగన్ ప్రభుత్వం ఐపిసికిచ్చింది. ఇలాంటి సంస్కరణలు జగన్‌కు మంచి ఇమేజ్ను తెస్తోంది.
గతంలో జగన్ వ్యక్తిత్వంపై పలురకాల ప్రచారాలుండేవి. ఎన్నికల్లో ధన ప్రవాహంతోనే భారీ సంఖ్యలో ఆయన సీట్లు సాధించారన్న అపప్రద కొనసాగేది. అయితే అధికారంలోకొచ్చాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పాలనతో పాటు ఎన్నికల విధానంపై ఆయనకున్న స్పష్టతను తెలియజెబుతున్నాయి. ముఖ్యంగా దిశ చట్టం ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమైంది. ఈ చట్టం మేరకు నమోదైన కేసుల్ని 90రోజుల్లోగా పరిష్కరించాల్సుంది. ఆదిలో ఇది ఆచరణ సాధ్యమా అంటూ సందేహాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు మహిళలపై వేధింపులకు పాల్పడ్డ నిందితుల్ని దిశా చట్టం ప్రకారమే విచారణ చేస్తున్నారు. 90రోజుల్లోగా దీన్ని పూర్తి చేసి శిక్షలు విధిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఎవరూ ఊహించని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలకు జగన్ ప్రభుత్వం తెరదీసింది. గ్రామస్థాయి నుంచి జరిగే ఎన్నికల్లో సంస్కరణల్ని ప్రతిపాదించడం ద్వారా భవిష్యత్‌లో చట్టసభలకు జరిగే ఎన్నికల్లో కూడా వీటిని కొనసాగించే అవకాశాల్ని కమిషన్‌కు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మద్యం లేదా నగదు పంపిణీ చేసినట్లు రుజువైతే సదరు అభ్యర్ధి గెలుపొందినప్పటికీ అర్హత కోల్పోతాడు. పైగా మూడేళ్ళ పాటు జైలు శిక్షకు గురౌతాడు. ఇందుకోసం ప్రభుత్వం నేరుగా ఓ యాప్‌ను విడుదల చేసింది. నగదు, మద్యం పంపిణీలకు సంబంధించి సెల్ఫోన్లో చిత్రీకరించి ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే చాలు వెనువెంటనే చర్యలకుపక్రమిస్తారు.
ఐపిసి చట్టం మేరకు కేసులు నమోదు చేస్తారు. ఈ యాప్ పర్యవేక్షణ బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారితో పాటు గతంలో ఎన్నికల కమిషన్‌లో విధులు నిర్వర్తించిన నిపుణులకు అప్పగించారు. ఇంత పకడ్బందీగా చట్టాన్ని రూపొందించి యాప్‌ను ప్రజలందరికీ అందుబాటులో పెట్టడంతో ఇది చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నంగానే అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి అధికార పార్టీకి ధన, జన బలంతో గెలిచే వెసులుబాటు అధికంగా ఉంటుంది. కానీ జగన్ ప్రభుత్వం ఈ వెసులుబాటును ఏమాత్రం వినియోగించుకోవడం లేదు. తానధికారంలో ఉన్నప్పటికీ గెలుపు కంటే ప్రజాస్వామ్య మూలస్థంభమైన ఎన్నికల వ్యవస్థలో స్పష్టమైన సంస్కరణల్ని తెచ్చేందుకు ఇదే సమయంగా జగన్ భావించారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు.













