టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం జగన్
రాష్ట్రంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యాటకులు, భక్తులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనికోసమే ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యాటక, ఆధ్మాత్మిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 20 టూరిస్ట్ పోలీస్స్టేషన్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను సంస్కరిస్తున్నామని, వీటివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సదుపాయాలు సహా భద్రత కల్పించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 లొకేషన్లు గుర్తించి అక్కడ కియోస్క్‌లను స్థాపించామన్నారు. ఈ కియోస్క్‌లన్నీ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానమై ఉంటాయని తెలిపారు. ప్రతి కియోస్క్‌లోనూ దాదాపు ఆరుగురు సిబ్బంది రెండు షిప్ట్‌లలో పనిచేసేలా రూపకల్పన చేసినట్లు సీఎం తెలిపారు. కియోస్క్‌లను ఎస్సై, ఏఎస్సై స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలీస్ శాఖలో చేస్తున్న వాటిలో టూరిస్ట్ పోలీస్‌స్టేషన్ కూడా గొప్ప సంస్కరణగా నిలబడుతుందన్నారు.













