అత్యంత ఆకర్షణీయంగా అసెంబ్లీ : చంద్రబాబు
పరిపాలన నగరంలో నూతనంగా నిర్మించబోయే రాష్ట్ర శాసనసభ భవంతిని రాజధానికే తలమానికంగా వుండేలా తీర్చిదిద్దదడం కోసం 160 ఎకరాల విస్తీర్ణాన్ని వెచ్చిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల మేర ప్రాంగణాన్ని కేవలం జల, హరిత అవసరాల కోసమే వదిలిపెడతారు. మొత్తం నగరానికి వన్నె తెచ్చేలా మన కొత్త శాసనసభ భవంతి నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు తుదిప్రణాళికలో కొన్ని మార్పులు సూచించినట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ కమిషనర్ చెరకూరి శ్రీధర్ తెలియజేశారు. ఈ మార్పుల ప్రకారం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతులను ఉత్తర దిశగా కొద్దిగా ముందుకు జరిపారు. అమరావతి నగర నిర్మాణ పురోగతిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పరిపాలన నగర నిర్మాణ ఆకృతులు, ప్రణాళిక 90శాతం, పూర్తయ్యాయని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ నెల 12 నుంచి 15వరకు లండన్ ఆకృతులపై జరిగిన కార్యగోష్టిలో పాల్గొన్నామని తెలిపారు. ముఖ్యంగా శాసనసభకట్టడం, ప్రజారవాణా వ్యూహం, జలవనరులపై నార్మన్ ఫోస్టర్ బృందంతో విపులంగా చర్చించామని తెలిపారు. ఈ నెల 22న పోస్టర్ బృందం మలివిడత ఆకృతుల్ని అందిస్తుందని అన్నారు. క్రిన్బెర్డ్ ఆధ్వర్యంలో ఇప్పటికే 90శాతం ప్రణాళిక పూర్తయ్యిందని తెలిపారు. ఈ ఆకృతుల్ని పరిశీలించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు అందిస్తే వాటిని పొందుపరుస్తూ తుది ఆకృతులు సిద్ధం చేసి అందిస్తారని చెప్పారు.













