ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
అసంబద్దమైన విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా రెక్కలు తెగిన పక్షిలా తయారైందని, మిగిలిన రాష్ట్రాలతో సమానంగా నిలబడేంతవరకూ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. కొత్త రాష్ట్రంపై విభజన సమయంలో రూ.33వేల కోట్ల అదనపు అప్పుల భారాన్ని రుద్దినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ద్రవ్య క్రమశిక్షణకు సంబంధించిన ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం వెళ్లడం రాష్ట్రానికి అసాధ్యంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత యూపీఏ ప్రభుత్వం చేసిన తీవ్ర అన్యాయాన్ని సరిదిద్ది నవ్యాంధ్రకు కొంతకాలం పాటు చేయూత నివ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.17 వేల కోట్లను వెంటనే ఏదో ఒక రూపంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం ఇప్పటివరకూ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై 17 పేజీల వినతిపత్రాన్ని ప్రధానికి సమర్పించి, సమస్యలను ఏకరవుపెట్టారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు సమావేశానంతరం ప్రకటించారు. సీరియస్గా ఆలోచించి, శక్తివంచన లేకుండా నావంతు పూర్తి సాయం చేస్తా అని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రధాని మరింత సమాచారం కోరారని, వెంటనే పంపుతామన్నారు. వ్యక్తిగతంగా సమీక్షించి అన్నింటినీ పర్కిషరిస్తారనని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.













