దేశంలో మనమే ఫస్ట్ : చంద్రబాబు
ఇలవేల్పు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధిపథంలో నడిపించేందుకు తనకు శక్తినివ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, అత్యంత శక్తివంతమైన దేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి అని పేర్కొన్నారు.
సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని నాలుగురోజుల పర్యటనకు చిత్తూరుజిల్లాలోని చంద్రగిరి మండలంలో స్వగ్రామం నారావారిపల్లికి ముఖ్యమంత్రి కుటుంబం చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున బోగిమంటలువేసిన అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా, నందమూరి బాలకృష్ణతో కలిసి తిరుమలకు విచ్చేశారు. ఆదివారం ఉదయం వైకుంఠ-1 క్యూకాంప్లెక్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు రాష్ట్రమంత్రి నారా లోకేష్,కోడలు బ్రాహ్మణి, మనవుడు దేనాన్ష్, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబం, నారా రోహిత్‌లకు టిటిడి ఇవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఇవో కెఎన్ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.
అందరూ కలసి ఉదయం విఐపి బ్రేక్‌దర్శనాల సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశ్వీరచనం చేశారు. శేషవస్త్రంతో సత్కరించారు. టిటిడి ఇవో అనిల్కుమార్సింఘాల్, తిరుమల జెఇవో కెఎస్ శ్రీనివాసరాజు, రిసెప్షన్ డిప్యూటీ ఇవో పి.హరీంధ్రనాథ్, ఓఎస్డి లక్ష్మీనారాయణ యాదవ్ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణను చూసి అభిమానులు జైసింహా అంటు నినాదాలు చేశారు.













