సీఐడీ దూకుడు.. ఎమ్మెల్యే ఆర్కేకి నోటీసులు..!
అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలు జరిగాయని.. అసైన్డ్ భూముల అంశంలో నిబంధనలు ఉల్లంఘిచారని నిర్ధారించిన సీఐడీ.. అప్పటి సీఎం, సీఆర్డీఏ ఛైర్మన్ చంద్రబాబునాయుడికి నోటీసులు జారీ చేసింది. అప్పుడు అమరావతి భూసేకరణలో కీలకంగా వ్యవహరించిన పురపాలక శాఖ మంత్రి నారాయణకు కూడా నోటీసులు అందించింది. అంతేకాక.. నారాయణకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సీఐడీ సోదాలు నిర్వహించింది.
తాజాగా అసైన్డ్ భూముల అవకతవకలకు సంబంధించి ఫిర్యాదు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ నోటీసులు అందించింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఎమ్మెల్యే ఆర్కేకి నోటీసులు జారీ చేసింది సీఐడీ. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పలువురు బాధితులు తమకు అన్యాయం జరిగిందని లిఖితపూర్వకంగా తనకు ఫిర్యాదు చేశారని.. ఆ ఆధారాలతోనే తాను సీఐడీకి కంప్లైంట్ ఇచ్చానని ఆర్కే చెప్తున్నారు. ఆర్కే చేసిన ఫిర్యాదు మేరకే సీఐడీ కేసు నమోదు చేసింది.
అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సీఐడీ చెప్తోంది. అందుకే చంద్రబాబునాయుడు, నారాయణలకు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది. చంద్రబాబు నాయుడిని 23వ తేదీన విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. అయితే చంద్రబాబునాయుడు గురువారం హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆర్కేను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
తనకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు కాపీలను ఆర్కే సీఐడీకి ఇప్పటికే సమర్పించానని చెప్పారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి మరింత లోతుగా సీఐడీ ఆరా తీసే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టగలిగితే.. తదుపరి చంద్రబాబునాయుడు, నారాయణలను ప్రశ్నించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఫిర్యాదుదారుడైన ఆర్కేను ముందుగా విచారణకు పిలిచింది. రేపటి విచారణలో సీఐడీకి ఆర్కే ఏం చెప్తారు.. ఎలాంటి ఆధారాలను అందిస్తారనేదాన్ని బట్టి తదుపరి విచారణ కొనసాగే అవకాశం ఉంది.













