బనగానపల్లె మీ భూమి మీహక్కు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
బనగానపల్లె, జూలై 09: ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండేలా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. “గడచిన రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతోంది. గత పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయి. లక్షల కుటుంబాలు వారి అరాచకానికి బలి అయ్యాయి. నచ్చని వారిని భయపెట్టేందుకు వారి భూముల్ని గత పాలకులు 22ఏ కింద చేర్చారు. వివాదాలు సృష్టించి భూములు లాక్కునేందుకు ప్రయత్నాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరిట ఓ నల్ల చట్టాన్ని తెచ్చారు. ప్రజల ఆస్తుల్ని కాజేసేలా భయాందోళనలు సృష్టించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తేవటమే సమస్యను మరింత జఠిలం చేసింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి ధృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. గత పాలకులు ప్రజల భూమి పత్రాలపైన, సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకున్నారు. ఆ ఫోటోల పిచ్చిని తుడిచేసేందుకు రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తున్నాం. కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లను పెట్టి తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. ఇదో ఉద్యమంగా, పవిత్రమైన కార్యక్రమంగా చేపట్టి భూ యజమానులకు హక్కులు కల్పిస్తున్నాం. 2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70.,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేస్తాం. ఏపీని ఎలాంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యం. విలేజ్ ఇనామ్ భూములను కూడా 22ఏలో పెట్టేశారు. వీటిని 1971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశాం. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నాం. తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరులోని వట్టి చెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుందిలో చాలా ఏళ్లుగా ఉన్న భూ వివాదాలను పరిష్కరించాం.
డోన్ నియోజకవర్గంలో ఉన్న 2074 ఎకరాల వక్ఫ్ భూముల్ని కూడా 22ఏలో గత పాలకులు పెట్టారు. ఆ భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగించి రైతుల సమస్యల్ని పరిష్కరించాం.” అని సీఎం అన్నారు.
వారు రాసింది రక్త చరిత్ర- మాది అభివృద్ధి సంకల్పం
“రాష్ట్రవ్యాప్తంగా భూసమస్యల్ని పరిష్కరించటంతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పనిచేస్తున్నాం. రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్, హీరో మోటార్స్, అమ్కా డిఫెన్సు ఫైటర్ జెట్ ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో రాయలసీమ రతనాల సీమగా మారుతుంది.
రాయలసీమలో తయారైన ఎన్ ఫీల్డ్ బుల్లెట్ లు దేశమంతా తిరుగుతాయి. రూ.40 వేల కోట్లు ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమ హార్టీ కల్చర్ హబ్ గా మారుతుంది.
నగరాలు, పట్టణాల కంటే కడప జిల్లా లింగాల వంటి ప్రాంతాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. నంద్యాలలోనూ హార్టికల్చర్ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్ లో 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే జలధార కార్యక్రమాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాం. నంద్యాల జిల్లాలో 18 కిలోమీటర్ల ఫీడర్ ఛానల్, చెక్ డ్యామ్ లు నిర్మించిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు. వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకుంటే నీటి భద్రత సాధ్యం అవుతుంది. రాయలసీమలో వారు రక్త చరిత్ర రాస్తే మేం అభివృద్ధి సంకల్పం చేస్తున్నాం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించటమే లక్ష్యంగా కూటమి ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది.ప్రజలకు అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలు, సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా పనితీరు మెరుగు పర్చుకుంటున్నాం. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించటమే ప్రభుత్వ లక్ష్యం. బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నాం. ఎవరు అఘాయిత్యానికి పాల్పడినా అదే వారికి చివరి రోజు అవుతుంది. రాష్ట్రంలో అత్యుత్తమ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి మెరుగైన విద్య, జీవన ప్రమాణాలు అందించాలని ఆలోచన చేస్తున్నాం.” అని సీఎం స్పష్టం చేశారు.
హే రామ్ అంటూ రావణుడికి సమర్ధనా?
“కుట్రలు కుతంత్రాలతో కులం, మతం, ప్రాంతం, వర్గాలతో సమాజాన్ని విడగొట్టాలని గొడ్డలి పార్టీ ప్రయత్నం చేస్తోంది. గంజాయి బ్యాచ్ ను, బ్లేడ్ బ్యాచ్ లను, రౌడీయిజాన్ని వైసీపీ ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో విధ్వంసం చేస్తోంది. అంతర్వేది రధం దగ్ధం, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ, రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసినా గత పాలకులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత పాలకులు తిరుపతి వెంకన్న ప్రసాదాన్ని కల్తీ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఇలాంటి ఘోరాలు చాలా చేశారు. ఇలాంటి వాటిని ప్రక్షాళన చేస్తున్నాం. రెండు రోజుల క్రితం ఆదోనిలో శివాలయంలోని దీపంలో ఓ దుర్మార్గుడు సిగరెట్ వెలిగించి అపచారం చేశాడు. వెంటనే కేసు పెట్టి నిందితుడ్ని అరెస్టు చేశాం. మత విద్వేషాలు రగిలించేలా ఎవరు దుశ్చర్యకు పాల్పడినా కూటమి ప్రభుత్వం క్షమించదు. సామాజిక మాధ్యమాల్లో కొందరు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. రావణ్ అనే వ్యక్తి పురాణాల్ని దూషిస్తాడు, మన రాముడిని, సీతపై నీచంగా మాట్లాడతాడు. తీవ్రవాదాన్ని , పాకిస్తాన్ ను సమర్థిస్తాడు. అలాంటి వారికి గొడ్డలి పార్టీ ఆర్ధిక సాయం అందిస్తుంది. ఎంతటి బరితెగింపు ఇది. ప్రజలు దీనిని గుర్తించాలి. వారి పోకడలు ఏమిటో తెలుసుకోవాలి.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే దూషిస్తున్న వారికి సామాన్య ప్రజలు ఏం లెక్క. తిరుమలకు వెళ్లి డిక్లరేషన్ ఇమ్మంటే వాటిని తిరస్కరించి అపచారం చేశారు. నేను చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా అక్కడి మతాచారాలను గౌరవిస్తాను. హే రామ్ అంటూ రావణుడ్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులను ఏమనాలో తెలీడం లేదు. కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని చెప్పారు. మతవిద్వేషాలు ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకోం. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన వాడే అని తెలిసి తోక ముడిచారు. ఓట్లు కోసం తండ్రికి పూజలు చేస్తున్నాడు. బ్రతికి ఉన్న తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వకుండా క్షోభ పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి అవసరమా. తల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తులు మనకు ఎందుకు?” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అనంతరం బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. వెదురుతో తయారు చేసిన ఆభరణాలను సీఎం ఆసక్తిగా పరిశీలించారు. డ్వాక్రా, మెప్మా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను స్వయం బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.








