‘మైసా’ కోసం రష్మిక రిస్కీ స్టంట్స్
బాడీ డబుల్ లేకుండా రెండు రోజుల్లో 20 గంటల పాటు అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసిన భారతీయ సినీ చరిత్రలో తొలి హీరోయిన్గా రికార్డు సృష్టించిన రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ప్రతిష్టాత్మక పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమె కెరీర్లోనే అత్యంత సవాల్ తో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచగా, ఇప్పుడు రష్మిక చేస్తున్న రిస్కీ స్టంట్స్ మరింత అంచనాలని పెంచుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గోండ్ గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యారు.
తాజాగా ఈ సినిమా కోసం అత్యంత ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాలను రష్మిక స్వయంగా చేశారు. రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల పాటు నీటిలో ఉండి అత్యంత క్లిష్టమైన అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. భారతీయ సినీ చరిత్రలో ఓ కథానాయిక స్వయంగా చేసిన మొట్టమొదటి అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఇదే.
ఈ సన్నివేశం కోసం బాడీ డబుల్‌ను ఉపయోగించకుండా, స్వయంగా నటించాలని రష్మిక నిర్ణయించుకున్నారు. సన్నివేశాల్లో సహజత్వం కోసం ఆమె చూపించిన ఈ అంకితభావం సినిమా టెక్నికల్ టీమ్‌తో పాటు అండర్‌వాటర్ యాక్షన్ టీమ్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ అండర్‌వాటర్ ఎపిసోడ్ కేవలం యాక్షన్ సీన్ మాత్రమే కాదు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సన్నివేశం సినిమాలోనే అత్యంత ఆకట్టుకునే విజువల్ హైలైట్‌గా నిలవనుంది.
ఈ చిత్రంలో రాహుల్ రవీంద్ర, ఈశ్వరి రావు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పి. కృష్ణ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఖాంఫక్డీ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక ఈ సినిమా కోసం పడుతున్న కష్టం చూస్తుంటే ‘మైసా’ లో ఆమెను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్ లో చూడబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.








