హీరో వేటలో శేఖర్ కమ్ముల
టాలీవుడ్ లో కథకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఒకరు. ప్రతి సినిమా కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ, తనకు పూర్తిగా నమ్మకం కలిగే వరకు స్క్రిప్ట్‌పై పని చేయడం ఆయన ప్రత్యేకత. తాజాగా రిలీజైన కుబేర తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగించిన ఆయన, తన తర్వాతి సినిమాకు సంబంధించిన కథను పూర్తిగా సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ఏషియన్ సునీల్(Ashian Suneel) నిర్మించనున్నారని సమాచారం. అయితే కథ సిద్ధమైనప్పటికీ హీరో సెలెక్షన్ మాత్రం ఇంకా ఫిక్స్ అవలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోలతో పాటూ యంగ్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో, శేఖర్ కమ్ముల తన కథను పలువురు నటులకు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు హీరోలకే పరిమితం కాకుండా ఇతర భాషల నటులను కూడా పరిశీలించే అవకాశాలున్నాయని సమాచారం. రాబోయే కొన్ని వారాల్లో కీలక సమావేశాలు జరిగే అవకాశం ఉండటంతో, ఈ సినిమాకు సంబంధించిన హీరోపై అప్పుడే స్పష్టత వచ్చే అవకాశముంది.
శేఖర్ కమ్ముల సినిమాల్లో నటించాలంటే ఎక్కువ కాలం డేట్లు కేటాయించాల్సి వస్తుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ప్రతి సీన్‌కు తనకు కావాల్సిన స్థాయిలో తీర్చిదిద్దే వరకు ఆయన రాజీ పడరని తెలిసిందే. ఇదే కారణంగా హీరో ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. మరోవైపు నాగ చైతన్య(Naga Chaitanya) పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆయన ఇప్పటికే పలు కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో శేఖర్ కమ్ముల తదుపరి సినిమాపై పూర్తి క్లారిటీ దసరా సమయానికి వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.








