అమెరికాకు వెళ్లనున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రినా చంద్రబాబు నాయుడు అమెరికాకు ఈ నెల 28న (ఆదివారం) వెళ్లనున్నారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. గత ఏడాది ఎడమ చేయి నొప్పికి అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే అమెరికాకు చంద్రబాబు పయనం కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగంతో పాటు ఆయన సన్నిహితులు చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం ఏర్పాట్లును పూర్తి చేశారు. వైద్య పరీక్షల అనంతరం వచ్చే నెల 1వ తేదీన అమెరికా నుంచి ఆయన స్వదేశానికి చేరుకోనున్నారు.













