Chandrababu: పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చాం

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ(Ap Assembly)లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్ట్ ల గురించి సిఎం మాట్లాడారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌కు మళ్లీ రూ.1,000 కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. డిసెంబర్ 25 నాటికి పోలవరం(Polavaram) డయాఫ్రమ్ వాల్ పూర్తిచేస్తామని స్పష్టం చేసారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార వరకు నీళ్లు తరలించవచ్చన్న ఆయన రూ.960 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
అక్టోబర్‌లోనే అనకాపల్లి వరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలాలు తీసుకువస్తామని పేర్కొన్నారు. రూ.1,425 కోట్లతో ఈ ప్రాజెక్టును పోలవరం కుడి కాలువతో అనుసంధానించామని తెలిపారు. పదేళ్లలో 439 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. శ్రీశైలంలో నిల్వ చేసిన నీళ్లు సీమ, హంద్రీనీవా, గాలేరు`నగరికి తరలించామన్న ఆయన మల్యాల నుంచి కుప్పంకు హంద్రీనీవా జలాలు తరలించామని తెలిపారు. దాదాపు 738 కిలోమీటర్ల మేర జలాలు తరలించామన్నారు చంద్రబాబు.
పులివెందులలోని చెరువులకు కూడా నీళ్లు అందించామన్న ఆయన హంద్రీనీవా ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశామని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీల నీళ్లు తరలించగలుగుతున్నామని వివరించారు. హంద్రీనీవా మార్గంలో 6 రిజర్వాయర్లు కూడా పూర్తి చేశామని తెలిపారు. కుప్పంకు నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో నా జన్మ సార్థకమైందని సంతోషం వ్యక్తం చేసారు. తుంగభద్ర ప్రాజెక్టులో దెబ్బతిన్న 33 గేట్ల మరమ్మతులు చేశామని సభలో గుర్తు చేసారు.
శ్రీశైలం స్పిల్‌వే రక్షణకు రూ.204 కోట్లతో టెండర్లు పిలిచాం, త్వరలో పూర్తిచేస్తామని, సోమశిల ప్రాజెక్టు మరమ్మతులు వచ్చే సీజన్‌కల్లా పూర్తిచేస్తామని స్పష్టం చేసారు. భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వర్షాకాలానికి ముందు 8 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా చూడాలని ఆకాంక్షించారు. వర్షాకాలం తర్వాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా చూడాలని, భూగర్భ జలాలను ఐదు మీటర్ల మేర మాత్రమే వాడుకోవాలన్నారు. ఈ విధంగా జలాలు వాడుకుంటే 700 టీఎంసీల భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. ఈ ఏడాది 2.1 శాతం తక్కువ వర్షపాతం ఉందన్న ఆయన, గతేడాది 18 శాతం మిగులు వర్షపాతం నమోదైందని వివరించారు.