ఆ నివేదిక అంతా ఓ బూటకం : చంద్రబాబు
రాజధాని కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులు మనోవేదనతో ఉన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం నాటకాలు ఆపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బోస్టన్ కమిటీ నివేదికపై మండిపడ్డారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ క్లయింట్ వద్ద డబ్బులు తీసుకుని ఏది కావాలంటే అది రాసిచ్చే సంస్థ అని విమర్శించారు. బోస్టన్ కమిటీకి తలాతోక ఉందా? అసలు బోస్టన్ కమిటీని ఎప్పుడు వేశారో కూడా చెప్పకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. రాజధానిపై బోస్టన్ గ్రూప్ నివేదిక ఇవ్వమని అడిగే హక్కు మీకు ఎక్కడిది? విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి బోస్టన్ గ్రూప్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ నివేదిక అంతా ఓ బూటకం.. దానికి విశ్వసనీయత లేదు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం పద్ధతి కాదు. మీకు నచ్చిన విధంగా బీసీజీ నివేదిక వచ్చింది అని అన్నారు.
దొండపాడు గ్రామంలో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో చనిపోయారు. ఇటీవల తిరుపతిలో ఓ రైతు చనిపోయారు. మల్లికార్జునరావుది రెండో ఘటన. ప్రభుత్వం చేతకాని తనం వల్లే రైతులు బలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై మందడంలో జరిగిన పోలీసుల దాడిని చంద్రబాబు ఖండించారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.













