పంచాయతీ ఫలితాలే వైకాపా పతనానికి నాంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా పతనం ఇక్కణ్నుంచే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. 20 నెలల పాలనలో అన్నీ ఉల్లంఘనలేనని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. అమరావతి, పోలవరం, పెట్టుబడులను ధ్వంసం చేశారు. విద్వేషాలు, హింసతో రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో హింసాకాండ, పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారు అని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉందని అన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. ఎంత హింస పెట్టినా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. 38.74 శాతం ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. 94 శాతం వైకాపా గెలుచుకుందని గాలి కబుర్లు చెబుతారా? అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలి అన్నారు. అచ్చెన్నాయుడిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడి అక్రమ కేసు బనాయించారు. వైకాపా నేతలు మాట్లాడితే మాత్రం పట్టించుకోరు. అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తారా? పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. తెలుగుదేశం పార్టీపై ఏపపక్షంగా కేసులు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 174 అక్రమ కేసులు పెట్టారు. ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రపై కేసు పెడతారా? అఖిల భారత సర్వీసు అధికారులను బెదిరిస్తారా? పార్టీ పెడుతున్నామని షర్మిల చెబుతుంటే ఏ2 మాత్రం లేదంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.













