ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ నేతలతో ఢిల్లీలో రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుడూ దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని ఆయా రాష్ట్రాల పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. దేశం, అంతర్జాతీయంగా ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్లు ఏపీలో ఉంటున్నాయని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ ఏపీ కోసం టీడీపీ పోరాడుతోందన్నారు. డ్రగ్స్‌తో యువత తద్వారా జాతి నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నియంత్రించాలని కోరితే ఒకే రోజు టీడీపీ కార్యాలయాలపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే మొదటిసారి ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు.
టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టారు. అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసులు గూండాల మాదిరిగా వ్వవహరిస్తున్నారు. కస్టడీలో టార్చర్ పెడుతున్నారు. టీడీపీ నేతలను ఆర్థికంగా, శారీరకంగా హింసలు పెడుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే మా కార్యాలయంపై దాడి చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ, అడిగే హక్కు లేదని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లే దాడి చేసి ప్రజలపై కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రపతికి అవన్నీ వివరించామన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి కోరినట్లు తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీఎంతో కలిసి పోలీసు వ్యవస్థని డీజీపీ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. డీజీపీని రీకాల్ చేయాలని ఆయన చేసిన తప్పులకు శిక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు.













