పర్యాటక హబ్‌గా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టపడ్డాక అందరూ ఆహ్లాదం కోసం ఎదురు చూస్తారన్నారు. విజయవాడ భవానీ ఐలాండ్‌లో రూ.16 కోట్లతో ఏర్పాటు చేసిన వాటర్ కం మ్యూజికల్ లేజర్ షోతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఉందో టూరిజానికి కూడా అంతే ప్రాధన్యాత ఇస్తామన్నారు. టూరిజం పేరుతో ఎంతో మంది విదేశీయులు ఇక్కడికొస్తారని, అదే విధంగా దేశం నుంచి ఎంతో మంది విదేశాలకు వెళ్తుంటారన్నారు. ఎక్కువ ఉపాధితో పాటు ఆదాయం వచ్చే అవకాశం టూరిజంలో ఉందన్నారు.
కృష్ణానది వల్లే ఈ ప్రాంతంలో ఇంత సంపద సృష్టి జరిగిందన్నారు. 800 ఎకరాల భవానీ ఐలాండ్‌ను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల్ని రూపొందిస్తున్నామన్నారు. పర్యావరణనికి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని అవకాశాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు, హిల్ స్టేషన్లు ఉన్నాయని, వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకాశం బ్యారేజీ పక్కన మరో బ్యారేజ్ నిర్మాణంతో నదిలో మరింత నీటిని నిలువ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం మొత్తం 50 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.













