చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు జాతీయ నాయకుల మద్దతు
ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్, శరద్ యాదవ్ తదితరులు దీక్షకు మద్దతు పలికారు. ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
ఆంధ్రాభవన్‌లో దీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అన్నారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే ”ఏపీ ప్రజలకు అండగా ఉంటాను. ఎక్కడికి వెళితే అక్కడ మోదీ అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆయనపై నమ్మకం పోయింది. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రఫేల్ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా.. చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోదీని, బీజేపీని ఓడిద్దాం” అంటూ రాహుల్ పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన .. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న క షికి అందరం సహకరిస్తామని చెప్పారు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ఫరూక్ చెప్పారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడి వరకు వచ్చారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి కేంద్రం పాలించాలని చూస్తోంది. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
‘ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ములాయంసింగ్ యాదవ్ అన్నారు. చంద్రబాబు వెంట మేమంతా ఉంటాం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంటన నడుస్తోంది. చంద్రబాబు వెంట రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వారు న్యాయం కోసం పోరాడతారు. అవసరమైతే తిరగబడతారు.”
ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పుడు దానిని అమలు చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఒబ్రెయిన్ అన్నారు. దానిపై ప్రధాని మోదీ ఒక్క మాట మాట్లాడరు. మోదీ నేతత్వంలోని ఈ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైంది. మోదీ, అమిత్ షా ఇద్దరూ దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. తన ప్రసంగాల్లో మోదీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ దేశానికి మోదీ చేసిందేమీ లేదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఆయన నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు.













