పేరుకే పొత్తులు.. కానీ అభ్యర్థులు మాత్రం ఆ పార్టీ నుంచే..
రాష్ట్రంలో జగన్ సర్కార్ ను ఓడించడానికి కూటమిగా ఏర్పడ్డాయి టీడీపీ, బీజేపీ, జనసేన. మొదట చంద్రబాబుతో పవన్ పొత్తు ఏర్పరచుకున్నప్పుడు సగానికి సగం సీట్లు వస్తాయి అని అందరూ అనుకున్నారు. బిజెపి వచ్చినా కనీసం 30% అయినా సీట్లు దక్కకపోతాయా అని ఆ తర్వాత అనుకున్నారు. తీరా సీట్లు పంచాక చూస్తే ఒక్కసారి అందరూ షాక్ అయ్యారు. చంద్రబాబు రాజకీయ చాణిక్యుడు అన్న విషయం అందరికీ తెలుసు కానీ.. మరి ఇంతగా ఎతులకు పైఎత్తులు వేస్తాడు అని ఎవరు ఊహించలేదు. ఎక్కువ సీట్లు తన వద్ద పెట్టుకొని కూటమికి చాలా కొద్దిగా సీట్లు ఇచ్చారు.. పోనీ ఎన్నో త్యాగాలు చేసి పొత్తులు కుదుర్చుకున్నాకైనా వచ్చిన సీట్లు పార్టీ వాళ్లకు దక్కాయా అంటే ఆ దాఖలు కూడా కనిపించడం లేదు. ఏదో వచ్చిన సీట్లలో తమకు దక్కక పోతాయా అని ఆశపడ్డ పార్టీ నాయకులకు ఇతర పార్టీల నుంచి వచ్చి తమ పార్టీలోకి చేరుతున్న వ్యక్తులు పెద్ద పోటీగా తయారయ్యారు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది టీడీపీ. తమ నేతలను ఎంతో తెలివిగా పార్టీలు మార్పించి.. ఉన్న కాస్త సీట్లు కూడా వాళ్లకే ఇప్పిస్తోంది.. దీంతో సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకొని ఎంతో డబ్బు ఖర్చుపెట్టిన నాయకులు నమ్మించి తమ పీక కోశారు అని వాపోతున్నారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాలు నమ్మి పవన్ వెనక నడిచిన జనసైనికులు అయితే చివరి నిమిషంలో వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం చూసి తట్టుకోలేకపోతున్నారు.













