Chandra Babu: గిరిజనుల మధ్యలో చంద్రబాబు నెక్స్ట్ టీ..

టీడీపీ (TDP) అధినేత ఏపీ ముఖ్యమంత్రి (AP chief minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈసారి పేదల మనసులు గెలుచుకోవడంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సామాజిక భద్రత పెన్షన్లను (Social security pensions) కేవలం పెంచడమే కాకుండా, ఆయా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వాటిని అందజేస్తున్నారు. ఇది 2024 జూలై నెల నుంచే ప్రారంభమైంది. ప్రతి నెలా ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా వారిని దగ్గరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారి ఇళ్లలో కూర్చుని, వారితో చర్చలు జరిపిస్తూ వారి జీవన శైలి, సమస్యలు, కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు. కొన్నిసార్లు వారి వంటింట్లోకి వెళ్లి, స్వయంగా టీ తయారు చేసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ప్రజల్లో ఆయనకు మరింత ఆదరణ పెరిగింది. ఒక్కో గ్రామంలోకి వెళ్లి పెన్షన్లు అందించడమే కాకుండా, అక్కడి స్థానిక సమస్యలను కూడా ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆయన ఇప్పుడు తొలిసారి అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) పర్యటనకు సిద్ధమవుతున్నారు. జూలై 1న పాడేరు (Paderu) ప్రాంతంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రాంతం గిరిజన ప్రాంతంగా ఉండటంతో, చంద్రబాబు అక్కడి వాస్తవ పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకునేందుకు ఇది మంచి అవకాశం అవుతుంది. మారుమూల తండాల ప్రజలు ఇప్పటికీ వైద్య సేవల కోసం డోలీలపై ఆసుపత్రులకు వెళ్తుండడం దురదృష్టకరం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ (Panchayathi Raj) మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పలు మార్లు ఈ ప్రాంతాల్లో పర్యటించి రహదారి పనులకు శంకుస్థాపనలు చేశారు. చంద్రబాబు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు.
ఇప్పుడు గిరిజన ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యక్షంగా సమీక్షించి, వాటికి తక్షణ పరిష్కారాలు చూపే అవకాశం ఉంది. రాజకీయ పరంగా చూస్తే అరకు (Araku) మరియు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే అరకు లోక్‌సభ సీటు గతంలో వైసీపీ (YSRCP) ఆధీనంలోకి వెళ్ళాయి. గత పదిహేనేళ్లుగా టీడీపీ (TDP) విజయాలు సాధించలేకపోయిన ఈ ప్రాంతాల్లో మళ్లీ తమ బలాన్ని పెంచుకునే క్రమంలో ఈ పర్యటన కీలకమవుతుంది. పవన్ ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పాడేరు అడుగుపెడుతున్న సందర్భంగా అందరూ ఆశాభావంగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఏ ప్రయోజనాలు ప్రకటిస్తారు, గిరిజనులకు ఎలాంటి భరోసా ఇస్తారో అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.