డిజిటల్ ప్లానిటోరియం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో రూ.4 కోట్లతో దక్షిణ భారతదేశంలో తొలిసారిగా నిర్మించిన డిజిటల్ ప్లానిటోరియం, ఆవిష్కరణల కేంద్రం ప్రారంభోత్సవం, అరవింద ట్రస్టు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న కంటి ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవిష్కరణల కేంద్రంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన నూతన ప్రయోగాలను పరిశీలించి అభినందించారు. ప్రతీ విద్యార్థి శాస్త్రవేత్తలుగా తయారుకావాలని ఆకాంక్షించారు. ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినయోగించి నిర్మించిన ఈ ప్లానిటోరియం, ఆవిష్కరణల కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంతటి సువిశాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అది దక్షిణాదిలో మొదటిది కావడం అభినందనీయమన్నారు. స్వచ్ఛతకు తిరుపతి నాంది పలికిందని, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను గెలుచుకుని తిరుపతి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిందన్నారు. అరవింద ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించుకున్న కంటి ఆసుపత్రి 2018 నాటికి పూర్తి చేస్తామన్నారు. సేవా కార్యక్రమాలక ముందుకొచ్చే ట్రస్టులకు సహకరిస్తామన్నారు.













