Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రమోషన్: వైసీపీ రాజకీయ ధోరణి మారలేదా?
ఎన్నికల జరిగిన ఇన్ని రోజుల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSR Congress party) రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోయిన తరువాత చాలా మంది నేతలు వైసీపీకి (YCP) గుడ్‌బై చెబుతుండగా, మరికొందరు తమ పదవులను కోల్పోయినా పార్టీ లోనే కొనసాగుతున్నారు. అయితే, ఈ తరుణంలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం కొందరు నేతలను ప్రోత్సహిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ యువజన విభాగం (YCP youth wing) అధ్యక్షుడిగా నియమితులైన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (Byreddy Siddharth Reddy)పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో శాప్ ఛైర్మన్‌గా (SAAP Chairman ) ఉన్న ఆయన, పార్టీ ఓటమి తర్వాత తెరచాటు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా తన దారిని కొనసాగించారు. ప్రత్యేకంగా, టీడీపీపై (TDP) తీవ్ర విమర్శలు చేస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వ్యాఖ్యలే ఆయనకు కొత్త పదవిని తీసుకొచ్చాయని భావిస్తున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. “నాలుగు ఏళ్ల తర్వాత మళ్లీ జగన్ (Jagan) సీఎం అవుతారు, అప్పుడు టీడీపీ నేతల సంగతి చూస్తా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించాయి. ఇదే కారణంగా ఆయనకు యువజన విభాగం బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై విమర్శలు చేయడమే కాకుండా, తమ క్యాడర్‌కు ధైర్యం నూరిపోసేలా బైరెడ్డి వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, పార్టీ ఓటమికి ఇదే ధోరణి ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ ఇలాంటి నోటిదురుసు వ్యవహారాలు ప్రజలకు నచ్చలేదని, అందుకే ఓటమి ఎదుర్కొవాల్సి వచ్చిందని అంటున్నారు. అయినప్పటికీ, ఇప్పటికీ ఈ ధోరణి మారలేదని, మళ్లీ అదే విధంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో బైరెడ్డిని ప్రోత్సహించారని చెబుతున్నారు.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వైసీపీ బలహీనపడినా, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తపరచే నేతలను పార్టీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక పార్టీ క్యాడర్ మాత్రం మరింత మెల్లిగా, ప్రజలకు దగ్గరగా వెళ్లే విధంగా వ్యవహరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, బైరెడ్డి లాంటి వారు గట్టిగా మాట్లాడతారనే ఉద్దేశంతో వారిని ముందుకు తెస్తూ పదవులు ఇస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, వైసీపీ భవిష్యత్తు రాజకీయాలలో తమ మార్గాన్ని ఎలా రూపొందించుకుంటుందనేది చూడాల్సిన విషయమే. నెమ్మదిగా ప్రజల్లో తిరిగి నమ్మకం పెంచుకుంటుందో, లేక మునుపటి తరహా ధోరణినే కొనసాగించాలనుకుంటుందో ? అన్నది వైసీపీ నాయకత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.













