తిరుపతి సీటు బీజేపీదే.. మరి పోటీ చేసేదెవరు?
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. దీనికి ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అందుకే పార్టీలన్నీ ఒక్కొక్కటిగా రంగంలోకి దిగిపోతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో చనిపోవడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే టీడీపీ పట్టుకోసం ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ-జనసేన పార్టీలు కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
వైసీపీ తరపున సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి బరిలో దిగుతున్నారు. వాస్తవానికి దుర్గాప్రసాద్ కొడుకు కల్యాణ్ చక్రవర్తిని బరిలోకి దింపుతారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా గురుమూర్తిని తెరపైకి తెచ్చింది వైసీపీ. మరోవైపు తిరుపతి ఉపఎన్నిక విషయంలో టీడీపీ దూకుడు మీదుంది. అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి ప్రచారపర్వంలోకి దూసుకెళ్లింది. మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచే పోటీ చేసి పనబాక లక్ష్మి ఓడిపోయింది.
అయితే బీజేపీ- జనసేన పార్టీలు తిరుపతి ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలుపు తమదేనని చెప్తున్నాయి. తిరుపతి పార్లమెంటు సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అయితే ఈ సీటులో తామే పోటీ చేయాలని జనసేన కూడా పట్టుబట్టడంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. అయితే చివరకు బీజేపీకే సీటును కేటాయిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. జనసేన-బీజేపీ ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మురళీధరన్ కూడా ఈ విషయం వెల్లడించారు.
సో.. తిరుపతి సీటు నుంచి బీజేపీ పోటీ చేయడం ఖాయమైపోయింది. మరి ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసేదెవరు.. అనేది ఆసక్తిగా మారింది. అయితే బీజేపీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి బాలయోగి, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తదితరులు ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే దాసరి శ్రీనివాసులు లేదు రత్న ప్రభల్లో ఒకరికి అధిష్టానం టికెట్ ఖరారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వారంలోనే అభ్యర్థిని ఖరారు చేస్తుందని తెలుస్తోంది.













