తిరుపతిలో బీజేపీకి నిజంగా అంత సీన్ ఉందా..?
తిరుపతిలో పోటీ చేయాలని అటు బీజేపీ, ఇటు జనసేన పోటాపోటీగా తలపడ్డాయి. అయితే చివరకు జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. బీజేపీకే సీటును వదిలేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. మరి నిజంగా బీజేపీకి తిరుపతిలో అంత పట్టుందా..? ఈ సీటు కోసం బీజేపీ ఎందుకంత పట్టు పట్టింది..? లాంటి అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
తిరుపతి సీటుపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. బీజేపీ తన హిందుత్వకు మరింత పదును పెట్టేందుకు ఈ స్థానం తప్పకుండా కలిసొస్తుందని భావిస్తోంది. అందుకు తగ్గట్లే ఎప్పటి నుంచే ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. తిరుపతి సీటు ఖాళీ అయినప్పటి నుంచి ఇక్కడికి బీజేపీ నేతల రాక పెరిగింది. రాష్ట్ర నేతలు తరచూ ఇక్కడికెళ్లి ఏదో ఒక హడావుడి చేయడం మొదలు పెట్టారు. తర్వాత జాతీయ నేతలను కూడా తీసుకొచ్చి పలు అంశాలపై ప్రెస్ మీట్లు పెట్టారు.
తిరుమలను అపవిత్రం చేస్తున్నారని.. అన్యమత ప్రచారం పెరిగిపోయిందని బీజేపీ పలు సందర్భాల్లో లేవనెత్తింది. ఎస్వీబీసీ ఈమెయిల్ వ్యవహారం కూడా బీజేపీకి కలిసొచ్చింది. అలాగే పింక్ డైమండ్ అంశాన్ని కూడా తరచూ ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ఇక్కడి ఎర్రచందనం తిరుమల శ్రీనివాసుడి ఆస్తి అని.. దీన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాక ఎర్రచందనం అక్రమాల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందంటున్నారు. ఇక్కడి ఆస్తిని పరిరక్షించేందుకు కేంద్ర బలగాలను దింపాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.
ఇప్పటికైతే ఇవే బీజేపీ అస్త్రాలు. వీటినే ప్రధాన అంశాలుగా చేసుకుని బరిలోకి దిగుతోంది. అంతేకానీ బీజేపీకి ఇప్పటికీ ఇక్కడ క్షేత్రస్థాయి నెట్ వర్క్ లేదు. పటిష్టమైన యంత్రాంగం లేదు. పైన నేతల హడావుడి తప్పితే కనీసం మండలస్థాయి కేడర్ కూడా లేదు. అయినా ఇక్కడ బరిలోకి దిగాలని డిసైడ్ అయింది. టీడీపీ బలహీనపడిందని బీజేపీ నమ్ముతోంది. టీడీపీ ఓటుబ్యాంకు తప్పకుండా తమవైపు మళ్లుతుందని.. అప్పుడు సీటు గెలవలేకపోయినా కనీసం రెండో స్థానం ఖాయమని నమ్ముతోంది. అదే జరిగితే టీడీపీ నుంచి తమ పార్టీలోకి వలసలు మరింత పెరుగుతాయనేది నమ్మకం. అప్పుడు వైసీపీకి ప్రత్యామ్నాయంగా పార్టీ ఎదిగేందుకు దోహదపడుతుందనే వ్యూహంతో బీజేపీ ఉంది. మరి బీజేపీ వ్యూహాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.













