AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్టులే ట్విస్టులు..!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో (Liquor Scam Case) గత రెండు రోజులుగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి (Peddireddy Midhun Reddy) మధ్యంతర బెయిల్ లభించగా, మరో ముగ్గురు కీలక నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy), ధనుంజయ్ రెడ్డి (Dhanunjay Reddy), బాలాజీ గోవిందప్పలకు (Balaji Govindappa) రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. అయితే, వీరి విడుదల ప్రక్రియలో జైలు అధికారులు ఆలస్యం చేయడంతో న్యాయవాదులు నిరసనలకు దిగారు. ఈ ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్నారు. జులై 20 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన, సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న మిధున్ రెడ్డి ఎన్నికల్లో పాల్గొనడం కీలకమని న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జడ్జి సెప్టెంబర్ 6న మిధున్ రెడ్డికి ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. రూ.50,000 బెయిల్ బాండ్, ఇద్దరు సెక్యూరిటీలను సమర్పించాలని, సెప్టెంబర్ 11 సాయంత్రం 5:30 గంటలలోపు తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో, మిధున్ రెడ్డి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.
లిక్కర్ స్కాం కేసులో ఏ31, ఏ32, ఏ33గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు కూడా విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 6న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురూ మే నెలలో అరెస్టయ్యారు. బాలాజీ గోవిందప్ప మే 14న, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మే 17న అరెస్ట్ అయ్యారు. లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు సెక్యూరిటీలను సమర్పించాలని, తమ పాస్‌పోర్టులను కోర్టుకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం వైఎస్ఆర్‌సీపీకి ఊరటనిచ్చినప్పటికీ, వీరి విడుదల ప్రక్రియలో జరిగిన ఆలస్యం వివాదాస్పదమైంది. బెయిల్ మంజూరైన తర్వాత, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను విడుదల చేసేందుకు న్యాయవాదులు సెప్టెంబర్ 6 సాయంత్రం విజయవాడ సబ్ జైలుకు చేరుకున్నారు. అయితే, జైలు అధికారులు విడుదలను ఆదివారం ఉదయం వరకు వాయిదా వేశారు. ఆదివారం ఉదయం న్యాయవాదులు మళ్లీ జైలుకు వెళ్లినప్పుడు, సూపరింటెండెంట్ అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. ఈ ఆలస్యంపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు ఉల్లంఘించారని, ఇది చట్టవిరుద్ధమని వారు ఆరోపించారు. చివరకు, ఈ ముగ్గురు నిందితులను జైలు అధికారులు విడుదల చేశారు.
అయితే ఈ ముగ్గురు నిందితులు కేసులో కీలకమని, వీళ్ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌ఐటీ) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు, తమ విడుదలను ఆలస్యం చేసిన జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా లిక్కర్ స్కాం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెయిల్ మంజూరు, విడుదల ఆలస్యం, సిట్ చర్యలు, నిందితుల కౌంటర్ పిటిషన్లతో ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది.