వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్య కేసు ఎన్ని మలుపులు తీసుకుంటోందో చూస్తూనే ఉన్నాం. వై.ఎస్.ఫ్యామిలీనే వివేకా హత్య విషయంలో రెండుగా చీలిపోయింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండడంతో ఎవరి మాట నిజమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సీబీఐ కూడా ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది కానీ.. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కోర్టుల్లో కేసులు నమోదువుతున్నాయి. సీబీఐ ముందరి కాళ్లకు కొందరు బంధం వేస్తున్నారు. దీంతో దర్యాప్తు అనుకున్నవిధంగా ముందుకు సాగడం లేదు. అందుకే సుప్రీంకోర్టు దీనికి డెడ్ లైన్ పెట్టి మరీ విచారణ క్లోజ్ చేయాలని ఆదేశించింది.
వై.ఎస్.ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు వివేకా హత్య తర్వాత మరింత పెరిగాయని చెప్పొచ్చు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత.. సొంత కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ కేసు దాఖలు చేశారు. తన అనుమానాలు నివృత్తి చేసేలా దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో సీబీఐ ఆ దిశగా విచారణ చేపట్టింది. దీంతో ఇప్పుడు కేసు విచారణ వై.ఎస్.అవినాశ్ రెడ్డి ఫ్యామిలీకి చేరింది. ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అవినాశ్ రెడ్డిని కూడా అరెస్టు చేయవచ్చని సంకేతాలు అందుతున్నాయి. అయితే తమ ప్రమేయం లేకపోయినా అనవసరంగా తమను ఇరికించారని అవినాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వివేకా కుమార్తె సునీతకు, వివేకా రెండో భార్యకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని.. అందుకే ఆయన హత్యకు గురయ్యారని అవినాశ్ రెడ్డి చెప్తున్నారు. ఈ కోణంలో విచారణ సాగట్లేదని ఆరోపిస్తున్నారు.
అయితే సీబీఐ మాత్రం అసలు ఆస్తి తగాదాలు వివేకా హత్యకు కారణం కాదని తేల్చేసింది. ఇప్పటికే వివేకా రెండో భార్య, కుమార్తె. అల్లుడు, భార్య… ఇలా అందరినీ సీబీఐ విచారించింది. చివరకు ప్రత్యక్షసాక్షులు, హత్య చేసిన వారు అప్రూవర్ గా మారడంతో అవినాశ్ రెడ్డి ఫ్యామిలీ వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి. హత్యకు ఆస్తి తగాదాలు కారణం కాదని సీబీఐ కూడా స్పష్టం చేస్తోంది. రాజకీయ కారణాలే హత్యకు పురిగొల్పినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది.
ఇదే అంశాన్ని బలపరుస్తూ ఇప్పుడు షర్మిల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. వివేకా హత్యకు ఆస్తి తగాదాలు కారణం కాదని షర్మిల చెప్పారు. బాబాయ్ వివేకానంద రెడ్డి ఎప్పుడో ఆస్తులన్నింటినీ సునీత పేరు పైన రాశారని.. ఇందులో ఎలాంటి వివాదాలు లేవని ఆమె తేల్చి చెప్పారు. ఆస్తి తగాదాలే కారణం అయితే హత్య చేయాల్సింది వివేకానంద రెడ్డిని కాదని.. సునీతను అని షర్మిల అభిప్రాయపడ్డారు. వివేకా సౌమ్యుడని, ఆయన గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు తక్కువ చేసి మాట్లాడుతున్నారన్నారు. ఆస్తి తగాదాల వల్లే వివేకా చనిపోయారని ఒకవైపు అవినాశ్ రెడ్డి చెప్తుంటే.. అవి అసలు కారణమే కాదంటున్నారు షర్మిల. దీంతో వై.ఎస్.ఫ్యామిలీలోనే విభేదాలున్నాయని మరోసారి ప్రూవ్ అయింది.













