కూటమిలో కొలిక్కిరాని సమస్యలు..! ఇప్పటికీ అంటీముట్టనట్లే..!!
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూలదోస్తేనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే జగన్ ను ఓడించేందుకు కలసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీ కోసం ఎన్డీయేలోకి టీడీపీ, జనసేన చేరాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అవసరాల దృష్ట్యా బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లేందుకు అంగీకరించింది. అయితే ఇప్పటికీ ఆ పార్టీల మధ్య గ్యాప్ తగ్గలేదనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఎన్నికలకు రెండు వారాల సమయం కూడా లేని పరిస్థితుల్లో ఇప్పటికీ గ్యాప్ కొనసాగుతుండడంతో ఆయా పార్టీల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ ను ఓడించేందుకు టీడీపీ కాస్త త్యాగం చేసిందని చెప్పొచ్చు. జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను, బీజేపీకి 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. వాస్తవానికి బీజేపీకి అంత సీన్ లేకపోయినా ఆ పార్టీకి ఎక్కవ సీట్లు ఇచ్చేందనే టాక్ ఇంటాబయటా వినిపిస్తోంది. అయినా రాష్ట్రంకోసం, వైసీపీని ఓడించడం కోసం కొన్ని త్యాగాలు చేయకతప్పదని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. దీంతో వాళ్లు కూడా శాంతించారు. అటు జనసేన, బీజేపీ కూడా తమకు కేటాయించిన సీట్లపై సంతృప్తిగానే సర్దుకుపోయాయి.
సీట్ల కేటాయింపు తర్వాత ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. అయితే ఇప్పటికీ బీజేపీ మాత్రం టీడీపీ, జనసేనతో పెద్దగా కలవట్లేదనే టాక్ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉమ్మడిగా పలు సభల్లో పాల్గొంటున్నారు. టీడీపీ, జనసేన కేడర్ కూడా కలిసిపోయి పనిచేస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య పెద్దగా సమన్వయలోపం కనిపించడం లేదు. కానీ బీజేపీ కేడర్ మాత్రం ఇప్పటికీ అంటీముట్టనట్టే ఉంటోంది. ఇందుకు కారణాలు ఏంటనేది తెలియట్లేదు.
అయితే టీడీపీ, జనసేన నేతలు మోదీ పేరు ప్రస్తావించకుండానే ప్రచారం చేస్తున్నారనే టాక్ బీజేపీలో నడుస్తోందని సమాచారం. అయితే మోదీ పేరెత్తితే ముస్లిం ఓట్లు దూరమయ్యే అవకాశం కనిపిస్తోందని టీడీపీ, జనసేన భయపడుతున్నాయి. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే టాక్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ పేరెత్తితే నష్టం తప్పదనే భావన టీడీపీ, జనసేనలో ఉంది. అందుకే ఆయన పేరెత్తకుండా ముందుకెళ్తున్నాయి. బీజేపీ మాత్రం తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటోంది.













