ఇప్పుడేం చెప్తారు హరిరామ జోగయ్య గారూ..?
కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హరిరామ జోగయ్య పేరు బలంగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖల ద్వారా ఆయన ఈ మధ్య సలహాలిస్తున్నారు. జనసేనకు కర్త కర్మ క్రియ తానే అయినట్లు ఆయన ఫీలయిపోతున్నారు. తన మద్దతు లేకపోతే జనసేన ఏమైపోతుందోనని తెగ బాధపడిపోతున్నారు. దీంతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీ చేరడంతో హరిరామ జోగయ్య ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టుకున్నారు. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. కష్టమో నష్టమో తానే భరిస్తున్నారు. పార్టీ నడపం చేత కావట్లేదని, టీడీపీకి మేలు చేసేందుకే పార్టీ పెట్టారని.. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా తన మానాన తాను నడుపుకుంటున్నారు. ఎవర్నీ సాయం చేయండని అడగట్లేదు. కొంతమంది విరాళాలిస్తే తిరిగి ఇచ్చేశారు కూడా. సొంత డబ్బులతో పార్టీని నెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తు నేపథ్యంలో 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు జనసేనకు దక్కాయి. దీనిపైన కాపు సంక్షేమసేన నేతనని చెప్పుకునే హరిరామ జోగయ్య పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
పవన్ కల్యాణ్ తన స్థాయి మరిచి ప్రవరిస్తున్నారని, సీఎం పదవి కోరాలని.. 80 సీట్లు అడగాలని, టీడీపీ మాయలో పడ్డారని, చంద్రబాబు మోసం చేస్తారని, లోకేశ్ ను సీఎం చేస్తారని .. ఇలా ఏవోవో అంశాలు ప్రస్తావిస్తూ బహిరంగ లేఖలు రాసుకొచ్చారు. అయినా పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు. కానీ తాడేపల్లిగూడెం జెండా సభలో మాత్రం తన నిర్ణయాలను ప్రశ్నించే వారు తనకు వద్దన్నారు. తనకు ఎవరి సలహాలూ, సూచనలా అక్కర్లేదని కుండబద్దలు కొట్టారు. పార్టీకి పని చేసే వాళ్లు కాకుండా గట్టున కూర్చొని విమర్శించే వాళ్లు తనకు అవసరం లేదని తేల్చేశారు. దీంతో హరి రామ జోగయ్య కూడా ఇకపై సలహాలివ్వనని, ఇక మీ ఖర్మ అని శపించారు.
అయితే వెంటనే తాజాగా మరో లేఖ రాశారు. మళ్లీ సేమ్ సోది. చెప్పిందే చెప్పి చెప్పి అలసిపోయారు. కాపులకోసం.. జాతి కోసం.. ఇలా ఏవోవే వల్లించారు. పవన్ మేలుకోసం ఎన్నయినా పడ్తానన్నారు. ఆయన కోసం ఏమైనా చేస్తానన్నారు. ఇదే సమయంలో హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. హరిరామ జోగయ్య వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఆయన రాస్తున్న లేఖల ద్వారా పవన్ ను దెప్పిపొడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీలో చేరిపోవడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. మరిప్పుడు హరిరామ జోగయ్య గారు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.













